సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏడాది ముందుగానే కసరత్తు ప్రారంభించారు. ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొనే విషయంలో పొలిటికల్ కన్సల్టెన్సీల పాత్ర కూడా కీలకమని భావిస్తున్న గులాబీ దళపతి... ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లో పలు పార్టీలు పొలిటికల్ కన్సల్టెంట్లను నియమించుకున్న తరహాలోనే రాష్ట్రంలోనూ కన్సల్టెంట్ల సేవలు పొందాలని ఇప్పటికే నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ–ప్యాక్) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే)కు చెందిన బృందం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పలుమార్లు సమావేశమైంది. రాష్ట్ర రాజకీయాలు, క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలకు సంబంధించి తమ పరిశీలనలోకి వచ్చిన అంశాలను పీకే బృందం ఈ భేటీల్లో ప్రస్తావించినట్లు సమాచారం. ఐ–ప్యాక్ బృందం ఏ తరహా సేవలు అందిస్తుంది, దాని పరిధి, పరిమితులు ఏమిటనే అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పీకే బృందంతో కలిసి పనిచేయడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను మదింపు చేసిన తర్వాత త్వరలో టీఆర్‌ఎస్, ఐ–ప్యాక్ నడుమ తుది ఒప్పందం కుదరనుంది.
పార్టీపరంగా ఎప్పటికప్పుడు సర్వేలు...
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ యంత్రాంగం, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల పనితీరుపై టీఆర్‌ఎస్ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. సమాచార సేకరణకు మై యాక్సిస్ వంటి ప్రముఖ సర్వే సంస్థల సేవలను వినియోగించుకుంటోంది. సర్వేలు శాస్త్రీయంగా ఉండేందుకు ప్రశ్నావళి రూపకల్పన మొదలుకొని నమూనాల సేకరణకు వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సర్వేలో భాగంగా కన్సల్టెన్సీలు కేవలం నమూనాల సేకరణకే పరిమితమవకుండా వివిధ కోణాల్లోనూ విశ్లేషిస్తూ నివేదికలు అందజేస్తున్నాయి. సందర్భాన్ని బట్టి సర్వేల ద్వారా ప్రజానాడిని పసిగట్టడం, పార్టీ పనితీరును అంచనా వేస్తున్న టీఆర్‌ఎస్ అధినేత... వివిధ నిఘా సంస్థల నుంచి అందే నివేదికలతో వాటిని పోల్చి చూస్తూ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో...
ఇన్నాళ్లూ అధికారిక కార్యకలాపాలు, పార్టీ కార్యక్రమాల ప్రచారం కోసం పీఏలు, పీఆర్‌వోలపై ఆధారపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇటీవలి కాలంలో పొలిటికల్ కన్సల్టెన్సీల వైపు చూస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ పనితీరుపై ప్రచారం, తమపై వచ్చే ఆరోపణలు, విమర్శలను తిప్పికొట్టడం తదితరాల కోసం కన్సల్టెన్సీల సేవలను వినియోగించుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోజువారీ కార్యక్రమాలు, సోషల్ మీడియా ఖాతాల నిర్వహణకు నాలుగు కన్సల్టెన్సీలు పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ కీలక మంత్రి కూడా ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ బాధ్యతను ఓ కన్సల్టెన్సీకి అప్పగించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment