సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళిత, గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం తలపెట్టిన ‘ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్‌డీఎఫ్), గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీ ఎస్‌డీఎఫ్) పర్యవేక్షణ గాడి తప్పింది. ఎస్‌డీఎఫ్ చట్టం ప్రకారం.. కనీసం ఆరు నెలలకోసారి కమిటీల సమావేశాలు జరగాలి.
కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)కుగాను ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ల పర్యవేక్షణ కమిటీల సమావేశాలు ఒక్కసారి కూడా జరగలేదు. గతేడాది జూన్ చివర్లో ఎస్టీ ఎస్‌డీఎఫ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తూతూమంత్రంగా సాగింది. ఎస్సీ ఎస్‌డీఎఫ్ పర్యవేక్షణపై గత ఏడాదిగా ఒక్కసారి కూడా కమిటీ భేటీ కాలేదు.
లెక్కలపై స్పష్టత ఏది?
‘ఎస్‌డీఎఫ్’చట్టం ప్రకారం.. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయిస్తుంది. వాటిని 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేస్తారు. శాఖల వారీగా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ నోడల్ డిపార్ట్‌మెంట్లుగా ఉంటాయి. వీటిని నిర్దేశించిన వార్షిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలి. ఏవైనా కారణాలతో నిధులు మిగిలితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి.
కానీ ప్రత్యేక అభివృద్ధి నిధుల ఖర్చు, ప్రణాళికలకు సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిస్తూ.. కొత్త వార్షిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాల రూపకల్పన ప్రారంభమైనా.. ఎస్‌డీఎఫ్‌కు కేటాయించిన నిధులతో చేపట్టిన పనులు, చేసిన ఖర్చు, పూర్తయిన పనులు, మిగులుకు సంబంధించిన గణాంకాలపై స్పష్టత లేదు.
రూ. 33,610.06 కోట్లు కేటాయించినా..
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 2021–22 వార్షిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.33,610.06 కోట్లు కేటాయించింది. ఇందులో ఎస్సీ ఎస్‌డీఎఫ్ కింద రూ.21,306.84 కోట్లు కేటాయించగా, ఎస్టీ ఎస్డీఫ్ కింద రూ.12,304.22 కోట్లు కేటాయించింది. 2020–21 నాటికంటే రూ.7,303.81 కోట్లు అదనంగా కేటాయించడంతో.. అభివృద్ధి పనుల్లో వేగం పెరుగుతుందని ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ పరిస్థితి భిన్నంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment