సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. సీజన్ మధ్యస్థానికి రావడం.. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు నమోదు కావడంతో పాటు ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తుండటంతో చలి ప్రభావం పెరుగుతోంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 4.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. రాత్రి, ఉదయం పూట చలి తీవ్రత అధికంగా ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు ఖమ్మం జిల్లాలోని పమ్మి వద్ద 35 డిగ్రీలుగా నమోదైంది. సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 4.6 డిగ్రీలు, తాంసీలో 4.9 డిగ్రీలు, వికారాబాద్‌లో 5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (చదవండి: రోజంతా గజగజ..)
రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. 22 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రత బీహెచ్‌ఈఎల్‌లో 10 డిగ్రీలు నమోదైంది. రానున్న మూడ్రోజుల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నమోదవుతుందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment