కౌలు రైతుకు పెద్ద కష్టం..పంట డబ్బూ పోయే! | Tenant Farmers Facing Money Issues Of Paddy Purchase In Telangana | Sakshi
Sakshi News home page

కౌలు రైతుకు పెద్ద కష్టం..పంట డబ్బూ పోయే!

Published Sun, Nov 14 2021 3:27 AM | Last Updated on Sun, Nov 14 2021 3:29 AM

Tenant Farmers Facing Money Issues Of Paddy Purchase In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కౌలురైతులకు మరో పెద్ద కష్టం వచ్చిపడింది. ధాన్యం కొనుగోలు డబ్బులను.. సదరు భూమి యజమాని బ్యాంకు ఖాతాల్లోనే వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త సమస్య మొదలైంది. ఇందుకోసం రైతులు కౌలుకు తీసుకున్న భూమి యజమానుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు కావాలనడం, ధాన్యం డబ్బులను ఆ ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా.. సదరు భూయజమానికి చెందిన పాస్‌బుక్‌లో ఎంత మేర భూమి ఉందో.. దానికి తగినంత మాత్రమే ధాన్యం కొంటామని చెప్తుండటంతో దిగాలు పడుతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఈ కొత్త నిబంధనలు ఏమిటని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు భారం తగ్గించుకునేందుకే కొత్త రూల్స్‌ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే.. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అడ్డుకునేందుకే ఈ కొత్త విధానం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. 
 
రైతు బంధుతో లింక్‌ అయిన ఖాతాల్లోకే.. 
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములన్నింటికీ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ఏటా రెండుసార్లు ఎకరానికి రూ.5 వేల చొప్పున సదరు భూయజమానుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తోంది. ఇప్పుడు పంట కొనుగోళ్లు, ధాన్యం డబ్బులను జమ చేయడానికి అవే వివరాలను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో.. జిల్లా కలెక్టర్లు పౌరసరఫరాల శాఖ అధికారులు/సిబ్బందిని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన సుమారు 4 వేల కొనుగోలు కేంద్రాల వద్ద లాప్‌టాప్‌/ట్యాబ్లెట్‌లతో పౌరసరఫరాల శాఖ తరఫున ఒక్కో వ్యక్తిని నియమించారు. ఆ వ్యక్తి ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతుల నుంచి ఆధార్‌ నంబర్‌ తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే సదరు రైతుకున్న భూమి వివరాలు కనిపిస్తాయి. ఆ రైతు పేరు మీద ఎంత భూమి ఉంది, ఏమేం పంటలు వేశారు, రైతుబంధుకు లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతా తదితర వివరాలు వస్తాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు.. ఆ వివరాలు అన్నీ సరి చూసుకున్నాకే వడ్లను తూకానికి వేస్తున్నారు. వివరాల్లో ఎక్కడ తేడా వచ్చినా కొనడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్మును రైతుబంధు జమవుతున్న బ్యాంకు ఖతాల్లోనే జమ చేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 
 
వ్యవసాయ శాఖ డేటాతో అనుసంధానించి.. 
రైతులకు ఉన్న భూమి విస్తీర్ణం, వేసిన పంట, రైతుబంధు కింద రైతుకు అందుతున్న సొమ్ము వివరాలన్నీ మండలాల వారీగా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉంటాయి. వానాకాలం, యాసంగి పంటలు వేసిన తర్వాత మండలాల ఏఈవోలు.. రైతుల భూమి విస్తీర్ణం, వేసిన పంటల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఇప్పుడు ఆ డేటాను పౌర సరఫరాల శాఖ తరఫున నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లకు అనుసంధానం చేశారు. దీనివల్ల కొనుగోలు కేంద్రంలో రైతుల ఆధార్‌ నంబర్‌ నమోదు చేయగానే.. వారికి ఉన్న భూమి, వారు వేసిన పంటల వివరాలు కనిపిస్తున్నాయి. అయితే రైతుల ఆధార్‌ నంబర్‌ నమోదు చేసినప్పుడు దానికి లింక్‌ అయి ఉన్న రైతుల ఫోన్‌కు ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్‌) వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేశాకే.. వివరాలన్నీ కనిపిస్తాయి. 
 
భూమికి తగినంతే కొనుగోళ్లు.. 
రైతులకు ఎంత భూమి ఉంటే.. దానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు ఇచ్చింది. గరిష్టంగా ఎకరానికి 36 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని లెక్కలు వేసింది. రైతులు తెచ్చిన పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి, కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యానికి లెక్క కుదిరితేనే సేకరిస్తోంది. దీనివల్ల కౌలు రైతులు తమకున్న కొద్దిపాటి భూమి పాస్‌బుక్‌ ఆధారంగా.. కౌలు పంట అంతా విక్రయించుకునే పరిస్థితి ఉండదు. భూయజమానులను బతిమాలి పాస్‌బుక్, ఇతర వివరాలు తెచ్చుకోవాల్సిందే. పంట డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాక వెళ్లి తీసుకోవాల్సిందే. 
 
ఆధార్‌ ఫోన్‌ నంబర్లు, ఓటీపీల సమస్యతో.. 
చాలా మంది రైతులు తాము ఆధార్‌ కార్డు తీసుకున్నప్పుడు.. తమ పిల్లల ఫోన్‌ నంబర్లు, తెలిసిన వారి నంబర్లను ఇచ్చారు. గ్రామాల్లో అయితే మీసేవ సెంటర్ల ఓనర్ల నంబర్లు కూడా ఇచ్చి నమోదు చేసుకున్నారు. వీటిలో చాలా వరకు ఫోన్‌ నంబర్లు మారిపోవడమో, ఏ నంబర్‌ ఇచ్చామన్నది మర్చిపోవడమో జరిగింది. ఇప్పుడా రైతులంతా ఓటీపీ ఏ నంబర్‌కు వచ్చిందో తెలియక.. ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు.  
 
విరాసత్, మ్యుటేషన్‌ భూములు.. ధరణి సమస్యలు 
ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయ భూముల వివరాలు చాలావరకు వ్యవసాయ శాఖ రికార్డుల్లో నమోదుకాలేదు. రైతుబంధుకు దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల మ్యూటేషన్, విరాసత్‌ అయిన భూములు వ్యవసాయ శాఖ రికార్డుల్లో లేవు. సదరు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తమ ఆధార్‌ నంబర్‌ ఇస్తే.. కేవలం రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న భూముల వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వ్యవసాయశాఖ పరిధిలోని డేటా (వేసిన పంటలు, రైతుబంధు ఖాతా నంబర్‌ వంటివి) చూపించడం లేదు. అలాగే ధరణి పోర్టల్‌లో అప్‌డేట్‌ కాని వ్యవసాయ భూములకు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఈ రైతులెవరూ కూడా తమ ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతోంది. 
 
కౌలు రైతులనే అంశమే లెక్కలోకి రాదు 
పంట పండించిన రైతులకు ధాన్యం సొమ్ము చేరేలా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులు అనే అంశమే మా లెక్కలోకి రాదు. అందుకే రైతు ఖాతాలోకే ధాన్యం సొమ్మును జమ చేస్తున్నాం. అలాగే రైతుకు ఉన్న భూమికి తగిన మేర పంటను మాత్రమే కొంటాం. రెండెకరాల పొలంలో 200 క్వింటాళ్లు దిగుబడి రాదు కదా. ఎకరానికి గరిష్టంగా 36 క్వింటాళ్లుగా నిర్ణయించాం. పీడీఎస్‌ బియ్యాన్ని కూడా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌గా చూపించే పరిస్థితి ఉండకూడదనే కఠినంగా వ్యవహరిస్తున్నాం. విరాసత్, మ్యుటేషన్‌ అయిన భూముల వివరాలను వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేయించుకుంటే ధాన్యం కొనుగోలు చేస్తాం. 
 గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి 
 
ఈయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లికి చెందిన కౌలు రైతు తంగెళ్ల శ్రీనివాస్‌. రెండెకరాలు కౌలుకు తీసుకుని పండించిన ధాన్యాన్ని 15 రోజుల కిందే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. రెండు రోజుల క్రితమే కొనుగోళ్లు మొదలవడంతో కాంటా వేసేందుకు సిద్ధమయ్యారు. భూయజమాని పాస్‌బుక్, ఆధార్‌ కార్డు జిరాక్స్‌లు ఇచ్చిన శ్రీనివాస్‌.. పంట సొమ్మును జమచేసేందుకు తన బ్యాంకు ఖాతా జిరాక్స్‌ కాపీ ఇచ్చాడు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ఓ వ్యక్తి ఆ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయగా.. వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డేటాలోని బ్యాంకు ఖాతా నంబర్‌తో సరిపోలలేదు. దానితో వడ్లు కాంటా వేసేందుకు నిరాకరించారు. భూయజమాని బ్యాంకు ఖాతా నంబర్‌ను నమోదు చేశాకే.. కొనుగోలుకు ఓకే అయింది. ఇప్పుడు పంట డబ్బులు భూయజమాని ఖాతాలోనే పడనున్నాయి. వారి నుంచి శ్రీనివాస్‌ డబ్బులు తీసుకోవాల్సి రానుంది. 
-తంగెళ్ల శ్రీనివాస్‌) 

ఎక్కడికని పోవాలె..? 
రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నవారిలో 20శాతం నుంచి 30 శాతం వరకు కౌలు రైతులే. ఎక్కడో హైదరాబాద్‌లోనో, ఇతర జిల్లాలు, దూర ప్రాంతాల్లోనో ఉన్నవారి భూములను స్థానికంగా ఉన్నవారు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నారు. ఇప్పుడు కౌలు రైతులు ఎక్కడో ఉన్న భూయజమానుల నుంచి ఆధార్, పట్టా పాస్‌బుక్, ఇతర వివరాలు తీసుకోవడం.. వారి ఫోన్‌కు వచ్చిన ఓటీపీ అడిగి తెలుసుకుని నమోదు చేయించడం తప్పడం లేదు. ఇంతా చేసి ధాన్యం డబ్బులు భూయజమాని బ్యాంకు ఖాతాలో పడితే.. మళ్లీవారి వెంటపడి తీసుకోవాల్సిన పరిస్థితి. దీనితో కౌలు రైతులు దిగాలు పడుతున్నారు.

అగ్గువకు అమ్ముకోవాల్సిన దుస్థితి 
కౌలు రైతులు అయితే తాము కౌలుకు తీసుకున్న భూయజమానుల నుంచి ఆధార్, ఇతర వివరాలు తీసుకుని ఇవ్వాల్సి వస్తోంది. పంట డబ్బులు కూడా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. భూయజమానులు వివరాలు ఇవ్వకున్నా, ఆ వివరాల్లో ఏవైనా తేడాలు ఉన్నా.. కౌలు రైతులకు ఇబ్బందే. చివరికి ఏ దిక్కూ లేక.. మిల్లర్లు, దళారుల వద్దకు వెళ్లి అగ్గువకో సగ్గువకో ధాన్యం అమ్ముకోక తప్పని పరిస్థితి. 

మిగతాది ఎవరు కొనాలి? 
పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న భూమికి తగినట్టే ధాన్యాన్ని కొనాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అయితే చాలా మంది కౌలు రైతులకు సొంతంగా కొద్ది గుంటలో, అర ఎకరం వరకో భూమి ఉంటుంది. వారు మరింత భూమిని కౌలుకు తీసుకుని పంట వేస్తుంటారు. ఇప్పుడు తమ పాస్‌బుక్‌లో ఉన్న కొద్దిపాటి భూమికి అనుగుణంగా కొంత పంటనే కొనుగోలు చేస్తే.. మిగతా ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలని కౌలు రైతులు వాపోతున్నారు. 
 
మా పైసలు మాకియ్యరా? 
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓబులాపూర్‌కు చెందిన ఏనుగుల రాజు ఓ కౌలు రైతు. 12 ఎకరాల్లో వేసిన పంట కోతకు రాగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ పంట కొనుగోళ్ల కోసం ఆధార్‌ అడుగుతుండటం, డబ్బులను భూ యజమాని ఖాతాలో వేస్తామంటుండటంతో ఆందోళనలో పడ్డాడు. అసలు తమ ధాన్యం కొంటరా లేదా, తమ వడ్ల పైసలు తమకు రావంటే ఎట్లాగని ప్రశ్నిస్తున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement