సాక్షి, హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం అంత సులభం కాదు. నిత్యం వేలాదిమంది భక్తులు పోటెత్తుతుంటారు. సిఫారసు లేఖలు పట్టుకుని పరుగులు పెడుతుంటారు. ఆ ప్రయత్నంలో సఫలమయ్యేవారు కొందరే.. మిగతావారికి మిగిలేది నిరాశే. మరి అలాంటి తరుణంలో దర్శన టోకెన్లు సిద్ధంగా ఉన్నా, భక్తులు రాక వృథా అవుతున్నాయంటే నమ్మశక్యం కాకున్నా నిజమే. నిత్యం సగటున దాదాపు 600 టోకెన్లు భక్తులు తీసుకోక మిగిలిపోతున్నాయి.
తిరుమల వెంకన్న దర్శనాన్ని సులభంగా కల్పించాలన్న ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ఆర్టీసీ బృహత్తర ప్రయత్నంతో ప్రయాణికుల ముందుకొచ్చింది. తిరుపతి వెళ్లే భక్తులు, ఆన్‌లైన్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్ బుక్ చేసుకుంటే వారికి తిరుమల శ్రీవారి దర్శన టోకెన్‌ను కూడా అందుబాటులో ఉంచుతోంది. ఆసక్తి ఉన్నవారు రూ.300 విలువైన ఆ దర్శన టోకెన్‌ను పొంది ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు.
ఈ ఆలోచన వచ్చిందే తడువు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో పలుమార్లు చర్చించి దానికి ఆమోదం కల్పించారు. ఈమేరకు టీటీడీ నిత్యం తెలంగాణ ఆర్టీసీకి వేయి టోకెన్లు అందిస్తోంది. ఆన్‌లైన్‌లో బస్ టికెట్ బుక్ చేసుకునేప్పుడే, టీటీడీ టోకెన్ కావాలా అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి ఆ మేరకు ఛార్జి కూడా చెల్లించి ఆధార్ నమోదు చేస్తే బార్‌కోడ్‌తో ఉన్న టోకెన్ అందుతుంది. ఆ రోజు తిరుపతి వెళ్తే బస్టాండ్‌లో ఆర్టీసీ సిబ్బంది దగ్గరుండి మరీ వారికి కొండమీదకు తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయిస్తారు. దర్శన టోకెన్ కోసం నానా ప్రయత్నాలు చేయాల్సిన శ్రమ లేకుండా సులభంగా వేంకటేశ్వరుడి దర్శనం కలుగుతుంది.
మిగిలిపోతున్న టోకెన్లు
గత కొన్ని రోజులుగా సగటున రోజుకు 400 టోకెన్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. ఆదిసోమవారాల్లో మాత్రం ఆ సంఖ్య 800 నుంచి 950 మేర ఉంటోంది. మిగతా రోజుల్లో దాదాపు 600 టోకెన్లు మిగిలిపోతున్నాయి.ఈనెల 1వ తేదీన 330, 2వ తేదీన 273, 3న 404, 4న 370 మాత్రమే అమ్ముడయ్యాయి. ఆదివారం అయిన 6వ తేదీన 882, 7న 607 అమ్ముడయ్యాయి.
వారం రోజుల ముందే బుక్ చేయాల్సి రావటంతో..
టీటీడీ వారం రోజుల ముందు దర్శన టోకెన్లు విడుదల చేస్తోంది. అంటే తిరుమల వెళ్లాలనుకున్న రోజుకు వారం ముందు ఆర్టీసీ బస్ టికెట్‌తోసహా దర్శన టోకెన్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రయాణికులకు బస్ టికెట్ విషయంలో రెండుమూడు రోజుల ముందు మాత్రమే టికెట్ రిజర్వ్ చేసుకునే అలవాటు ఉంది. రైలు టికెట్ కోసం నెల రోజుల ముందు ప్రయత్నించేవారు కూడా బస్ టికెట్లు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయన్న ఉద్దేశంతో రెండుమూడు రోజుల ముందు రిజర్వ్ చేసుకుంటుంటారు.
ఇక్కడే సమస్య ఎదురవుతోంది. వారం కంటే తక్కువ వ్యవధిలో బుక్ చేస్తే తిరుమల దర్శన టోకెన్ ఉండదు. వారం ముందే బుక్ చేసుకోవాలన్న విషయం ఇంకా జనంలోకి బలంగా చేరలేదు. దానిపై చాలినంత ప్రచారం లేదు. నెలరోజులు ముందు నుంచి ప్రయత్నిస్తున్నా స్వామి దర్శన టోకెన్ దొరకని పరిస్థితిలో.. టీఎస్‌ఆర్టీసీ వద్ద నిత్యం వేయి దర్శన టోకెన్లు ఉంటున్నా.. చాలామంది భక్తుల దరి చేరటం లేదు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment