టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరైన మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, పలు కమిటీల చైర్మన్‌లు, సీనియర్ ఉపాధ్యక్షులు
సాక్షి, హైదరాబాద్: ఏడున్నరేళ్లుగా రాష్ట్రంలో అధికారాన్ని అనుభవిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు చేసిన అవినీతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో వారి అవి నీతి కార్యకలాపాలపై నివేదికలు రూపొందిం చాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీన్ని ఆధారాలతోసహా నిరూపిం చేలా నియోజకవర్గాల సమన్వయకర్తలు స్థానిక నేతలతో కలిసి పనిచేయాలని సూచించారు.
గురువారం ఇందిరాభవన్‌లో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ కార్యక్రమం కోసం నియమించిన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం జరిగింది. దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాణిక్యం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాని నేతలకు నోటీసులిచ్చి వివరణ కోరాలని, ఆసక్తి లేని వారిని ఇబ్బంది పెట్టి పనిచేయించు కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్ నేతల అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి సీబీఐ, ఈడీలాంటి దర్యాప్తు సంస్థల విచారణకు డిమాండ్ చేయాలని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హామీలను అమలుచేయడంలో ఎలా విఫలమయ్యారో వివరించాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని, ఇదే ఊపును అధికారంలోకి వచ్చేవరకు కొనసాగిం చాలని మాణిక్యం చెప్పారు.
రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు: రేవంత్
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ 72 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. హైదరాబాద్ లో వరదలు వచ్చిన ప్పుడు రూ.10వేలు కూడా సరిగా ఇవ్వలేని కేసీఆర్ రాష్ట్రంలోని 30 లక్షల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారో ప్రశ్నించాలన్నారు.
సమన్వయకర్తలే ప్రచారం చేయాలి: భట్టి
కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసే బాధ్యత నియో జకవర్గాల సమన్వయకర్తలదేనని అన్నారు. సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్ గౌడ్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, అజారు ద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి, పొడెం వీరయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment