సాక్షి, హైదరాబాద్: పచ్చదనాన్ని, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రపంచమంతటా అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఏదైనా అభివృద్ధి పనుల కోసం చెట్లను తొలగించాల్సి వస్తే... నిర్దయగా నరికివేయడం లేదు. దశాబ్దాలుగా పెరిగిన చెట్లను శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పెకిలించి... మరోచోటికి తరలించి ప్రాణప్రతిష్ట చేస్తున్నారు. కానీ తెలంగాణ కొత్త సచివాలయం నిర్మిస్తున్న ప్రాంతంలో ఉన్న చెట్లు మాత్రం ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం సచివాలయ నిర్మాణానికి పునాదులు తవ్వే పని మొదలైంది. కాస్త ముందుచూపుతో ఇక్కడున్న చెట్లను ఈపాటికే మరో ప్రాంతానికి ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో తరలించి ఉంటే బతికేవి. కానీ ప్రస్తుతం పొడి వాతావరణం ఏర్పడటంతో ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో చెట్లకు ప్రాణదానం చేసే అవకాశాలు బాగా సన్నగిల్లాయి.
రెండు వానాకాలాలు పోయాయి...
కొత్త సచివాలయ భవన నిర్మాణానికి వీలుగా అక్కడి కార్యాలయాలను దాదాపు ఏడాదిన్నర క్రితమే బీఆర్‌కేఆర్ భవన్‌తో పాటు ఇతర భవనాల్లోకి తరలించారు. 2019 ఆగస్టు నుంచి సచివాలయ ప్రాంగణం ఖాళీగా ఉంది. గత జూలైలో పాత భవనాల కూల్చివేత మొదలైంది. అంటే.. మధ్యలో రెండు వానాకాలాలు వెళ్లిపోయాయి. ట్రాన్స్‌లొకేషన్ పద్ధతిలో చెట్లను మరో చోటకు తరలించి బతికించుకునేందుకు జూన్ నుంచి నవంబర్ వరకు సానుకూల వాతావరణం ఉంటుంది. డిసెంబర్ నుంచి వాతావరణంలో తేమ శాతం తగ్గి పొడి పరిస్థితులు ఏర్పడటంతో చెట్లు బతికే అవకాశాలు సన్నగిల్లుతాయి. అదను దాటిపోయాక ప్రస్తుతం సచివాలయంలో చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు వీలుగా అధికారులు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అంటే ప్రక్రియ మొదలయ్యేందుకు ఎంత లేదన్నా మరో పక్షం రోజులకు పైగా సమయం పడుతుందన్న మాట. అప్పుడు ట్రాన్స్‌లొకేట్ చేసే చెట్లలో 30 శాతమే బతికే అవకాశం ఉంటుంది.
స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చినా..
వాటా ఫౌండేషన్ అనే సంస్థ చెట్లను ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు ముందుకొచ్చింది. గత నెలలో దాదాపు 18 చెట్లను శంషాబాద్‌లోని ఓ ప్రైవేటు స్థలానికి తరలించి తిరిగి నాటింది. ఆ తర్వాత ఆ సంస్థ ఈ ప్రక్రియ నుంచి తప్పుకుంది. సచివాలయ ప్రాంగణంలో దాదాపు 600కు పైగా చెట్లు ఉంటే, సరిగ్గా కొత్తభవనం నిర్మించే ప్రాంతంలో 90 వరకు ఉన్నాయి. ఈ 90 చెట్లను తొలగించాల్సిందే. ఇందులో 33 చెట్ల ట్రాన్స్‌లొకేçషన్‌కు అటవీశాఖ అనుమతించింది. మిగతావి కొట్టేయచ్చన్న మాట. కొట్టేసే చెట్లను కూడా ట్రాన్స్‌లొకేట్ చేసేందుకు స్వచ్ఛంద సంస్థ ఆసక్తి చూపగా, ఆ విషయంలో అధికారులకు– ఆ సంస్థకు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. తర్వాత ఆ సంస్థ ట్రాన్స్‌లొకేషన్ ప్రక్రియ నుంచి తప్పుకొన్నట్టు తెలిసింది.
తరలించాలంటే సమయం అవసరం ఇలా
ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో 60 ఏళ్లకు పైబడ్డ చెట్లు కూడా ఉన్నాయి. తొలగించాల్సిన ప్రాంతంలో దాదాపు 50కి పైగా పెద్ద చెట్లు ట్రాన్స్‌లొకేషన్ ద్వారా మరోచోట కొత్త జీవితం ప్రారంభించే అవకాశం ఉంది. సాధారణంగా పెద్ద చెట్టును ట్రాన్స్‌లొకేట్ ప్రక్రియ ప్రారంభానికి ముందు కనీసం 21 రోజుల సమయం అవసరమవుతుంది. కొమ్మలు, పెద్ద వేర్లు తొలగించిన తర్వాత ఆయా ప్రాంతాల్లో చిగుళ్లు, కొత్త పిల్ల వేర్లు రావాల్సి ఉంటుంది. అప్పుడు తరలిస్తేనే ఆ చెట్టు ఏనుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు టెండర్లు పిలిచి కొత్త సంస్థను ఎంపిక చేశాక.. మళ్లీ 21 రోజుల సమయం అవసరమవుతుంది. అప్పటికి వాతావరణంలో పొడి పరిస్థితులు పెరిగి వాటిని బతికించటం మృగ్యమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment