మంగళవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. లీకేజీపై లోతైన దర్యాప్తు కోసం కేసును నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగించారు.
శ్రీనివాస్ వెంటనే బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి కేసుకు సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పేపర్ల లీక్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. దీనిపై రెండురోజుల్లో నివేదిక ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించడం ద్వారా ఈ విషయాన్ని తాను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నాననే సంకేతాలిచ్చారు.
ఇంకోవైపు విపక్ష కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వంపై, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించడంతో లీకేజీ వ్యవహారం రాజకీయ రంగును పులుముకుంది. టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్ని పరీక్షల పేపర్లు లీకయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గ్రూప్–1 పేపర్ సైతం లీకయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ విమర్శనాస్త్రాలు సంధించారు.
టీఎస్‌పీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చబట్టే అవకతవకలు జరుగుతున్నాయంటూ ధ్వజమెత్తారు. ఇదిలావుండగా.. పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు మంగళవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఒకదశలో టీఎస్‌పీఎస్సీ బోర్డును పెకిలించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కదిలింది. పేపర్ లీకేజీ ఘటనపై ప్రత్యేకంగా మూడు గంటలకుపైగా సమావేశమై చర్చించింది. ఇంటి దొంగలే గొంతు కోశారంటూ కమిషన్ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే పలు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన, ఇతర పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో మాత్రం.. ఈ పేపర్ లీకేజీ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో, ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో, ఏయే పరీక్షలు రద్దవుతాయో, కమిషన్ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో, తమ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment