ఇది తాండూరు డిపో బస్సు. తాండూరు నుంచి మెహిదీపట్నం బయలుదేరింది. అనంతగిరి గుట్టను దాటే క్రమంలో ఎత్తు ఎక్కలేక రోడ్డుపైనే ఆగిపోయింది. దీంతో డ్రైవర్ ప్రయాణికులను దింపేసి వెనకకు పల్లం ఉండటంతో రివర్స్‌లో వేగంగా పోనిచ్చి అతికష్టమ్మీద ఇంజిన్ ఆన్‌చేయగలిగాడు. కానీ ప్రయాణికులతో ఎత్తు ఎక్కలేకపోయింది. దీంతో ఖాళీ బస్సు ఎత్తు ఎక్కిన తర్వాత ప్రయాణికులు బస్కెక్కాల్సి వచ్చింది.
డొక్కు బస్సులను నడపడం ఆర్టీసీకి దినదినగండంగా మారింది. ప్రయాణికులు నిండితే మోయలేనివి కొన్ని, పికప్ లేక ముందుకు ఉరకలేకపోతున్నవి మరికొన్ని, ఉన్నట్టుండి అదుపుతప్పి భయపెడుతున్నవి ఇంకొన్ని.. ఇలాంటి బస్సులతో సంస్థ సతమతమవుతోంది. ఏరోజుకారోజు సర్వీసింగ్‌తో అతికష్టమ్మీద నడుపుతోంది. పరిస్థితి మారాలంటే ఇప్పటికిప్పుడు రూ. 500 కోట్లు కావాల్సి ఉండగా చేతిలో చిల్లిగవ్వ లేక, ప్రభుత్వం నుంచి లోన్ పుట్టక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది.
మూలన పడే స్థితిలో సగం బస్సులు
నిబంధనల ప్రకారం 15 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న బస్సులను తప్పించాలి. కానీ అవి పోతే ప్రయాణికుల అవసరాలకు బస్సులు సరిపోవు. దీంతో నిత్యం సర్వీసింగ్ చేసి, బ్రేకులు వగైరా సరిగా ఉన్నాయో లేదో ఒకటికి పదిమార్లు సరిచూసుకుని బస్సులను రోడ్డుపైకి తెస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో దాదాపు సగం.. అంటే 2,800 బస్సులు ఈ పరిస్థితిలోనే ఉన్నాయి. కొన్ని బస్సులు ఏకంగా 20 లక్షల కిలోమీటర్ల సర్వీసునూ పూర్తి చేసుకున్నాయి. ఒక్క డీలక్స్ కేటగిరీలోనే 15 లక్షల కిలోమీటర్లు దాటిన, అతి చేరువగా ఉన్న బస్సులు 190 ఉన్నాయి. అన్ని కేటగిరీల్లో ఈ సమస్య ఉంది.
1,400 కొత్త బస్సులు కావాలి
ఆర్టీసీకి ఇప్పటికిప్పుడు దాదాపు 1,400 కొత్త బస్సులు అవసరముంది. ఇందుకు కనీసం రూ.500 కోట్లు కావాలి. కానీ చేతిలో పైసా లేక ఆర్టీసీ దిక్కులు చూస్తోంది. గతంలో బ్యాంకు నుంచి రూ.500 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు అందులోంచి రూ.100 కోట్లు కొత్త బస్సులకు వాడాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. కానీ జీతాలకు ఇబ్బందిగా ఉండటంతో వాడారు.
ఇటీవలి బడ్జెట్‌లో ఆర్టీసీకి ప్రభుత్వ పూచీకత్తు రుణాల కింద ఒక్క పైసా కూడా ప్రతిపాదించలేదు. దీంతో కొత్త బస్సుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతోంది. అతికష్టమ్మీద ఓ బ్యాంకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఆర్టీసీ డిపోను కుదువపెట్టి ఆ రుణం తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వాటితో 300 బస్సులు కూడా రాని పరిస్థితి.
కొత్త బాడీలు కట్టించాలన్నా రూ. 250 కోట్లు కావాలి
ఓ కేటగిరీలో ఎక్కువ కాలం తిరిగిన బస్సును అంతకంటే తక్కువ కేటగిరీలోకి మార్చి కొత్త బాడీ కట్టించి తిప్పే మరో ప్రతిపాదననూ అధికారులు ఇచ్చారు. ఇలా వివిధ కేటగిరీలకు సంబంధించి 2,683 బస్సులను రీప్లేస్ చేయాలని పేర్కొన్నారు. కొత్త బాడీ కట్టేందుకు కూడా దాదాపు రూ.250 కోట్లు అవసరమవుతాయన్నారు.
పల్లెలకు బస్సులు దూరం
ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ ఏకంగా రూ.2,200 కోట్ల నష్టాలను చవిచూసింది. కోవిడ్, డీజిల్ సంక్షోభాలతో నష్టాలు తీవ్రమయ్యాయి. దీంతో ఆదాయం ఎక్కువ వచ్చే రూట్లకే సంస్థ ప్రాధాన్యమిస్తోంది. ఫలితంగా చాలా పల్లెలు ప్రభుత్వ రవాణాకు దూరమవుతున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment