సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్టీసీ త్వరలో 46 పెట్రోల్ బంకులు ప్రారంభించనుంది. దీనికి సంబంధించి మూడు ప్రధాన చమురు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో కలిపి ఆరు బంకులు ఏర్పాటు చేయనుండగా ఇతర పట్టణాల్లో మిగతావి ఏర్పాటు చేస్తోంది.
నాలుగైదేళ్ల క్రితమే పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆర్టీసీ... అప్పట్లో 73 ప్రాంతాల్లో బంకుల ఏర్పాటుకు నిర్ణయించింది. అయితే అనువైన ప్రాంతాల్లో లేకపోవడం, కోర్టు కేసులు, నిరభ్యంతర పత్రాలు రాకపోవడంతో కేవలం 23 బంకులే ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వాటి సంఖ్య 69కి చేరుకోనుంది. ఈ కొత్త బంకులు 6 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పది చోట్ల సొంతంగా..
46 ప్రాంతాల్లో ప్రారంభించనున్న పెట్రోల్ బంకుల్లో 10 బంకులు డిపోల పక్కనే ఉండటంతో వాటిని సొంతంగా నిర్వహిస్తే బాగుంటుందని ఆర్టీసీ భావిస్తోంది. మిగతా వాటిని సర్వీసు ప్రొవైడర్ల ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. సొంతంగా నిర్వహించడం ద్వారా స్థలాలకు చమురు కంపెనీల నుంచి లీజు అద్దెతోపాటు చమురుపై కంపెనీలు ఇచ్చే పూర్తి కమీషన్ సమకూరుతుందని ఆర్టీసీ పేర్కొంటోంది.
అలాగే సర్వీసు ప్రొవైడర్లకు కేటాయించి నిర్వహించే వాటి ద్వారా సైతం చమురు కంపెనీల నుంచి లీజు అద్దె, విక్రయించే ప్రతి లీటర్ డీజిల్‌పై రూ.1.89, పెట్రోల్‌పై రూ. 2.83 చొప్పున కమీషన్ సమకూరుతుందని చెబుతోంది. దీనివల్ల సొంత స్థలాలకు రక్షణ ఏర్పడటమే కాకుండా నెలకు రూ. 2 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తోంది. చమురు కంపెనీల నుంచి నేరుగా చమురు రావడం, ఆర్టీసీ బంకులు కావడంతో కల్తీకి ఆస్కారం ఉండకపోవడం వల్ల వాహనదారుల నుంచి ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని యాజమాన్యం వ్యక్తం చేస్తోంది.
భూములు కాపాడుకొనేందుకే..
రాష్ట్రంలో ఆర్టీసీకి చాలాచోట్ల ఖాళీ స్థలాలున్నాయి. వాటిల్లో కొన్ని విశాలమైనవి కాగా మరికొన్ని చిన్నచిన్న స్థలాలు. అయితే కొన్నేళ్లుగా ఆర్టీసీ స్థలాల కబ్జా యత్నాలు పెరుగుతుండటంతో వాటిని కాపాడుకొనేందుకు వీలైనన్ని చిన్న స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. కాస్త పెద్దగా ఉన్నవాటిల్లో కల్యాణ మండపాలు, షాపింగ్ కాంప్లెక్సులకు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పుడు 46 బంకుల కోసం ఒప్పందం చేసుకోగా త్వరలో మరికొన్ని స్థలాలను కూడా అందుకు సిద్ధం చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment