కరీంనగర్ టౌన్: నిఖిత, లిఖిత ఇద్దరు కవలలు. ఇటీవల నిఖిత ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే మూడు నెలల కిందటే లిఖిత కూడా ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో ఆ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వడం సాధారణమే అయినప్పటికీ కవల పిల్లలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇలా కవల పిల్లలకు జన్మనివ్వడం అరుదైన రికార్డు అని వైద్యులు చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామానికి చెందిన నిఖిత మొదటి కాన్పు కోసం కరీంనగర్‌లోని యశోద కృష్ణ ఆస్పత్రికి రాగా, పరీక్షించిన వైద్యురాలు ఆకుల శైలజ.. ఆమె గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే 8 నెలలు దాటడం మహిళకు నొప్పులు రావడంతో శనివారం ఉదయం సిజేరియన్ చేశారు. దీంతో ఇద్దరు ఆడ, ఇద్దరు మగ శిశువులు జన్మించారు. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో ఇంక్యుబేటర్‌లో ఉంచారు.
నిఖిత సోదరి లిఖితకు కూడా 3 నెలల కింద అదే ఆస్పత్రిలో డెలివరీ కాగా, ఆమెకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. నిఖిత భర్త సాయికిరణ్ పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నిఖితతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని, జన్యుపరంగానే ఇలా పుడతారని డాక్టర్ శైలజ చెప్పారు. ఇది అత్యంత అరుదైన ఘటన అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!)
Comments
Please login to add a commentAdd a comment