Valentine's Day 2023 Special In Adilabad Love Couple - Sakshi
Sakshi News home page

Valentines Day 2023: నువ్వుంటే నా జతగా.. నేనుంటా ఊపిరిగా

Published Tue, Feb 14 2023 8:43 AM | Last Updated on Tue, Feb 14 2023 10:43 AM

Valentines Day Special On Adilabad Love Couples - Sakshi

ప్రేమ.. అనిర్వచనీయమైన అనుభూతి, ప్రేమ.. వెలకట్టలేని సంపద. నిస్వార్థమైన, నిజాయతీతో కూడిన ప్రేమ ఎంతో పవిత్రమైనది..శక్తివంతమైనది. ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపించే భావోద్వేగమే ప్రేమ. ఏ బంధమైన వికసించాలన్నా..చిరకాలం నిలవాలన్నా ప్రేమ ఒక్కటే మార్గం. అది ఇద్దరు వ్యక్తుల మధ్య అయి ఉండవచ్చు.. లేదా కుటుంబం, సమాజం మీద అయి ఉండవచ్చు. నిజమైన ప్రేమ ధనంతో.. బలంతోనే దక్కించుకునేది కాదు. నిజమైన ప్రేమను నిజంగా ప్రేమించడం ద్వారానే జయించగలం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చాలా మంది తమ నిజమైన ప్రేమతో జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు. ప్రేమను గెలిపించి.. పెళ్లి బంధంతో ఏకమై ప్రేమానుభూతులను ఆస్వాదిస్తున్నారు. నువ్వుంటే నా జతగా... నేనుంటా నీ ఊపిరిగా అంటూ  దేహాలు వేరైనా మన ప్రేమ ఒక్కటే అంటూ ముందుకు సాగుతున్నారు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో కొంతమంది ప్రేమానుభూతులు వారి మాటల్లో..  

అలుపెరగని ప్రేమ
జన్నారం: మండలంలోని పొనకల్‌కు చెందిన మూల భాస్కర్‌గౌడ్, రేణుక ఇంటర్‌లోనే ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటే అయినా వయస్సు రీత్యా మైనర్లు కావడంతో ఐదేళ్లపాటు ఆగి ఆతర్వాత పెద్దలను ఒప్పించి 1980 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. ప్రేమించడమే కాకుండా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నప్పుడే ఆ ప్రేమ చిరకాలం నిలుస్తుందని, తల్లిదండ్రులను బాధపెట్టవద్దన్నది మా ఉద్దేశమని వారు పేర్కొంటున్నారు.
– భాస్కర్‌గౌడ్, రేణుక 

పెద్దలను ఒప్పించి..
చెన్నూర్‌రూరల్‌: పట్టణంలోని మంగళి బజార్‌లో నివాసం ఉంటున్న కారెంగుల శ్రావణ్‌ పటేల్, మానసరాణి దంపతులది ప్రేమ వివాహం. 2011లో మానస కాలేజీకి వెళ్తుండగా చూసిన శ్రావణ్‌ ఆమెతో ప్రేమలో పడ్డాడు. సుమారు ఐదేళ్లపాటూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు కావడంతో యువతి ఇంటికి వెళ్లి పెద్దలతో మాట్లాడాడు. పెళ్లికి ఒప్పుకోవడంతో 2016లో వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమారులు జన్మించారు. శావణ్‌ సోదరుడు సందీప్‌ది కూడా ప్రేమ వివాహమే. విజయ అనే యువతిని ప్రేమించి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
– కారెంగుల శ్రావణ్, మానస రాణి 

నమ్మకమైన బంధానికి ప్రతిరూపం
గుడిహత్నూర్‌: నమ్మకమైన బంధానికి ప్రతి రూపమే ప్రేమ అని.. ఇది లేకుండా మనిషి సంఘ జీవుడు కాలేడని చెప్తున్నారు ఉపారపు సత్యరాజ్‌–పార్వతి దంపతులు. మండలంలోని లింగాపూర్‌కు చెందిన సత్యరాజ్‌ 2017లో హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా అక్కడే పనిచేస్తున్న ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని గోయగాంకు చెందిన పార్వతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరుకావడంతో ఇరువురి పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో గతేడాది జనవరి 25న  రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.    
– సత్యరాజ్, పార్వతి 

ప్రేమలో గెలిచి..
బోథ్‌: మండల కేంద్రానికి చెందిన కట్ట పల్లవి, భూమేశ్‌ దంపతులది ప్రేమ వివాహం. ఒకే కాలనీలో ఉంటున్న ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇరువురి కులాలు వేరుకావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో 2011లో తలమడుగు మండలం కజ్జర్ల శివారులోని శివాలయంలో స్నేహితుల మధ్య వివాహం చేసుకున్నారు. వివాహమైన వారం రోజులకే ఇరువురి కుటుంబసభ్యులు కలిసిపోయారు. అప్పటినుంచి వారి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది. ఏడాడూ వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదని దంపతులు పేర్కొంటున్నారు. 
  – కట్ట పల్లవి, భూమేశ్‌ 

ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొని..
తాంసి: తాంసి మండల కేంద్రానికి చెందిన రేండ్ల అజయ్, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన అనూష హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2010లో వివాహం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూనే చదువును పూర్తి చేశారు. అజయ్‌ ఎంబీఏ పూర్తి చేసి ఫార్మా కంపనీలో మార్కెటింగ్‌ ఉద్యోగంలో చేరాడు.  రెండేళ్ల క్రితం అల్‌మైటి ఫార్మా కంపనీ ప్రారంభించాడు. అనూషను సైతం జీఎన్‌ఎం శిక్షణ పూర్తి చేయించడంతో హైదరాబాద్‌లోని మెడికవర్‌ హాస్పిటల్‌లో సీనియర్‌ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దీంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యాయి. సమాజసేవలో సైతం ముందుండి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.          
– రేండ్ల అజయ్, అనూష 

చదువు అండగా నిలిచింది 
నిర్మల్‌చైన్‌గేట్‌: ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ చదువుతున్న సమయంలో ఆదిలాబాద్‌కు చెందిన కేంద్రీ సోనీతాయ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పీజీ పూర్తి చేసిన రెండేళ్ల తర్వాత ఇద్దరం హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఉద్యోగంలో చేరాం. ఇద్దరి కులం ఒక్కటైనా భాష వేరుకావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. సెప్టెంబర్‌ 26, 2015న నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని గండి రామన్న ఆలయంలో వివాహం చేసుకున్నాం. మేము చదివిన చదువు మాకు అండగా నిలిచింది. ప్రస్తుతం ఇద్దరం నిర్మల్‌లోనే లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాం. 2018లో పాప జన్మించింది. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు మా ప్రేమను అర్థం చేసుకొని మాతో కలిసిపోయారు. 
– బలాస్ట్‌ శివరామకృష్ణ, కేంద్రీ సోనీతాయ్‌  

ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొని..
తాంసి: తాంసి మండల కేంద్రానికి చెందిన రేండ్ల అజయ్, ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన అనూష హైదరాబాద్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2010లో వివాహం చేసుకున్నారు. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూనే చదువును పూర్తి చేశారు. అజయ్‌ ఎంబీఏ పూర్తి చేసి ఫార్మా కంపనీలో మార్కెటింగ్‌ ఉద్యోగంలో చేరాడు.  రెండేళ్ల క్రితం అల్‌మైటి ఫార్మా కంపనీ ప్రారంభించాడు. అనూషను సైతం జీఎన్‌ఎం శిక్షణ పూర్తి చేయించడంతో హైదరాబాద్‌లోని మెడికవర్‌ హాస్పిటల్‌లో సీనియర్‌ నర్స్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దీంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యాయి. సమాజసేవలో సైతం ముందుండి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.          
– రేండ్ల అజయ్, అనూష  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement