సాక్షి, హైదరాబాద్: దేశంలో సెమీ బుల్లెట్ రైలుగా గుర్తింపు పొందిన వందేభారత్ రైలు ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగుపెట్టబోతోంది. ఇటు రూపు, అటు తీరు.. రెండూ అభివృద్ధి చెందిన దేశాల్లోని రైలు తరహాలో ఉండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తిస్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ రైలు కోసం అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే ఏడు రైళ్లు పట్టాలెక్కగా, ఈనెల 19న సికింద్రాబాద్–విజయవాడ మధ్య ఎనిమిదో రైలు పరుగు ప్రారంభించనుంది. తెలుపు వర్ణం, దానిపై నీలి రంగు చారలు, బుల్లెట్ రైలు తరహాలో లోకో ముందు రూపు, వెడల్పాటి నలుపు రంగు కిటికీ వరస.. ఇలా చూడగానే ఆకట్టుకునే రూపంతో ఉన్న ఈ రైలు సికింద్రాబాద్–విజయవాడ మధ్య పరుగుపెట్టబోతోంది. ఆ తర్వాత దాన్ని విశాఖ వరకు పొడిగించే యోచనలో ఉన్నారు.
ఆటోమేటిక్ తలుపులు...
►ఈ రైలు వెలుపలి రూపు ఏరోడైనమిక్ డిజైన్‌తో రూపొందించారు.
►గరిష్టంగా 180 కి.మీ. వేగాన్ని అందుకునేలా డిజైన్ చేశారు. ఈ వేగాన్ని ప్రయోగదశలో మాత్రమే పరీక్షించి చూశారు. ప్రస్తుతం నిర్వహణ దశలో దాని గరిష్ట వేగ పరిమితి మాత్రం గంటకు 160 కి.మీ. మాత్రమే. ఈ గరిష్ట వేగాన్ని 140 సెకన్లలో అందుకుంటుంది.
►సికింద్రాబాద్–విజయవాడ మధ్య ట్రాక్ వేగ పరిమితిని గంటకు 110 కి.మీ నుంచి 130 కి.మీ.కు పెంచారు.
►ఫుల్లీ సస్పెండెడ్ ట్రాక్షన్ మోటార్‌తో రూపొందించిన ఆధునిక బోగీలను ఈ రైలులో వినియోగించారు. దీంతో రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు.
►ఈ రైలుకు ప్రత్యేకంగా లోకోమోటివ్‌ను జత చేసే అవసరం ఉండదు. రైలులో అంతర్భాగంగానే ఇంజిన్ ఉంటుంది. ఎంఎంటీఎస్ రైలు తరహాలో లోకోపైలట్ కేబిన్‌లు రెండు చివర్లా ఉంటాయి.
►ఇందులో సీట్ల ప్రత్యేకతే వేరు. అవి 180 డిగ్రీల కోణంలో తిప్పుకోవచ్చు. వెడల్పాటి కిటికీ ఉన్నందున, దాని నుంచి బయటకు చూస్తూ ఉండాలనుకున్నప్పుడు సీటును కిటికీ వైపు తిప్పుకోవచ్చు. కుటుంబసభ్యులు రెండు సీట్లను పరస్పరం ఎదురెదురుగా తిప్పుకుని కూర్చోవచ్చు.
►కోచ్‌లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. అందులో ప్రయాణికులకు రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్‌ప్లే అవుతుంటాయి. ఆడియో అలర్ట్‌లు కూడా ఉంటాయి.
►ఈ రైలుకు ఆటోమేటిక్ తలుపులుంటాయి. వాటి నియంత్రణ లోకోపైలట్ వద్దే ఉంటుంది. మధ్యలో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు. రైలు ఆగిన కొన్ని క్షణాలకు డోర్లు తెరుచుకుంటాయి. బయలుదేరటానికి కొన్ని సెకన్ల ముందు మూసుకుంటాయి.
►లోపలి వైపు, బయటి వైపు సీసీటీవీ కెమెరాలుంటాయి. లోపల వైఫై వసతి ఉంటుంది.
►రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు పరస్పరం ఢీకొనకుండా ‘కవచ్’ పరిజ్ఞానాన్ని కల్పించారు.
►ప్రతి కోచ్‌లో నాలుగు ఎమర్జెన్సీ లైట్లు ఉంటాయి. విద్యుత్తు సరఫరాలో అవాంతరాలు ఏర్పడినప్పుడు ఇవి వెలుగును అందిస్తాయి.
పగటి వేళలోనే పరుగు..
ఈ రైల్లో ప్రస్తుతానికి చైర్‌కార్ మాత్రమే ఉంటుంది. సాధారణ రైళ్లలాగా స్లీపర్ బెర్తులుండవు. అందువల్ల వీలైనంత దగ్గరి స్టేషన్ల మధ్యనే తిరుగుతాయి. రాత్రి వేళ ప్రయాణం లేదు. సాధారణంగా దూరప్రాంతాల మధ్య రాత్రి వేళ ప్రయాణాన్నే జనం కోరుకుంటారు. నిద్ర సమయంలో ప్రయాణాన్ని ముగించటం ద్వారా పగటిపూట పనులు చూసుకునే అవకాశం కోసం యత్నిస్తారు. కానీ వందేభారత్ రైలు పగటి వేళ మాత్రమే ప్రయాణించాల్సి రావటం ఓ ప్రతికూలాంశం. దీంతో తదుపరి రైళ్లలో బెర్తులు ప్రవేశపెట్టేయోచనలో అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment