రసూల్‌పురా: మద్యం సీసాల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం టైరు పేలి బోల్తా పడిన ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కొంపల్లి ఐఎంఎఫ్‌ఎల్ డిపో నుంచి రూ.32 లక్షల విలువైన మద్యం కాటన్ బాక్సులతో డీసీఎం కంటైయినర్ బంజారాహిల్స్ వైపు వెళ్తోంది.
బోయిన్‌పల్లి ఎంఎంఆర్ గార్డెన్ వద్దకు చేరుకోగానే వెనక టైరు పేలి అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ఈ ఘటనలో కంటెయినర్‌లో నుంచి మద్యం సీసాల కాటన్ బాక్స్‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
సమీపంలో ఉన్న బస్తీవాసులు, రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు మద్యం సీసాలను తీసుకుని ఉడాయించారు. మద్యం సీసాలను తీసుకుని వెళ్తున్న కొందరిని డీసీఎం డ్రైవర్ బసవలింగప్ప, ఇద్దరు హెల్పర్లు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించారు. డీసీఎం బోల్తా పడిన ఘటనతో జాతీయ రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment