మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.చిత్రంలో మంత్రి తలసాని, చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: తనకు జనంలో తిరగడం, రాజకీయ నాయకుడిగా వారికి సేవ చేయడం ఎంతో ఇష్టమని.. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొన్ని పరిమితులకు లోబడి ఉండటంతో ప్రజల్లోకి వెళ్లలేకపోవడం ఇబ్బందిగా ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజకీయాలు కూడా ఒకప్పటిలా ఆరోగ్యకరంగా లేవని.. సిద్ధాంతాలు మారిపోయాయని చెప్పారు.
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో యోధా లైఫ్‌లైన్ డయాగ్నొస్టిక్స్ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. వేదికపై ఉన్న కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవిని ఉద్దేశిస్తూ.. ఆయన రాజకీయాల నుంచి బయటికొచ్చి మంచిపని చేశారని, మానసిక, శారీరక ప్రశాంతతకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రాష్ట్రపతిగా అవకాశం వస్తే కచ్చితంగా చేపట్టి.. తెలుగువారి కీర్తిని మరింత పెంచాల’ని చిరంజీవి కోరగా.. వెంకయ్యనాయుడు తాను సిద్ధమే అన్నట్టుగా సంకేతం ఇచ్చారు.
‘ఉప రాష్ట్రపతిగా అడ్రస్ మారిందేగానీ నా డ్రస్ మారలేదు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడి నేలలో ఏదో మహిమ ఉందని, ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న సంస్థలకు మనవారే సీఈవోలుగా ఉన్నారని పేర్కొన్నారు.
ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి..
దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు ఆరోగ్యకర జీవనానికి దోహాదపడతాయని.. ప్రజలు ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మన దేశం ముందుందని.. పరిశోధకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. అయితే కొందరి మోసపూరిత వ్యవహారాలతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని.. అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు.
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల పెట్టాలని కేంద్ర ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.
చిరంజీవి ట్రస్టుకు రూ.25లక్షలు విరాళం
భవిష్యత్‌లో రాబోయే కొన్నిరకాల జబ్బులను జీనోమిక్ టెక్నాలజీతో ముందుగానే తెలుసుకోవచ్చని, అలాంటి వైద్యసేవలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటం సంతోషకరమని సినీ నటుడు చిరంజీవి అన్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ బతికి ఉండేవాడన్నారు.
ఈ సందర్భంగా నిరుపేద కళాకారులకు వైద్యపరీక్షల్లో రాయితీ కల్పించాలని చిరంజీవి కోరగా.. ‘మా’ అసోసియేషన్ (సినీ నటుల సంఘం) సభ్యులకు 50 శాతం రాయితీ ఇస్తామని డయగ్నొస్టిక్స్ నిర్వాహకుడు సుధాకర్ కంచికచర్ల ప్రకటించారు.
అంతేకాకుండా చిరంజీవి ట్రస్టుకు విరాళంగా రూ.25 లక్షల చెక్కును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి తలసాని చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, చెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, చాముండేశ్వరీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment