
స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ హైదరాబాద్‌లో ప్రదర్శన ఇవ్వనున్నారు.
సాక్షి, హైదరాబాద్: నగరానికి మరో స్టాండప్ కమెడియన్ రాక ఖాయమైంది. డెహ్రాడూన్‌కి చెందిన వీర్‌దాస్ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా స్టాండప్ కామెడీ షోలకు ప్రసిద్ధి చెందారు. అయితే చాలా మంది కమెడియన్‌లకు భిన్నంగా ఆయన అటు కమెడియన్‌గా ఇటు నటుడిగా కూడా రాణిస్తున్నారు.
గతంలో ఒకటీ అరా ఉన్నప్పటికీ ఇటీవల వరుసగా కొన్ని షోస్‌లో ఆయన హాస్యంపై సంప్రదాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హిందూ జనజాగృతి సమితి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 10న బెంగళూరులో ఆయన ప్రదర్శన రద్దయింది.
అనంతరం తమ నగరంలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు ఆహ్వానం పలికారు.. వీటన్నింటి నేపథ్యంలో ఆయన నిర్వహిస్తున్న వాంటెడ్ టూర్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న నగరానికి వచ్చి మాదాపూర్ శిల్పకళావేదికలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆ ప్రదర్శనకు సంబంధించిన టిక్కెట్ల బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. (క్లిక్: ఊహల్లో కోటీశ్వరుడిని చేసి ఉన్నదంతా ఊడ్చేశారు!)