కల్తీ పెట్రోల్ బాటిల్ చూపిస్తున్న వినియోగదారుడు. (ఫైల్)
సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు నీళ్లు పోస్తున్నారు. ఇదేమి ప్రశ్నిస్తే అది అంతే అంటున్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తోడు పెట్రోల్‌లో కలుస్తున్న నీళ్లు వాహనాలను దెబ్బతీసి జేబులను గుల్ల చేస్తున్నాయి. బంకుల యాజమానులకు కాసుల ధ్యాస తప్ప నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలన్న ప్రయత్నం మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పెట్రోల్ బంకుల నిర్వహణలో నిర్లక్ష్యం వినియోగదారులకు శాపంగా మారింది. ఆయిల్ కంపెనీల నుంచి ఇథనాల్‌తో కూడిన పెట్రోల్ సరఫరా నిల్వలు దెబ్బతీస్తున్నాయి. ఇథనాల్ మిళితమైన పెట్రోల్ నిల్వల్లో నీటిచుక్క కలిసినా...క్రమంగా పెట్రోల్ మొత్తం నీరుగా మారుతోంది.
అధికారికంగానే: ప్రధాన చమురు సంస్థలు అధికారికంగానే ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాం కింద పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ను కలుపుతున్నట్లు కంపెనీల ఇన్వాయిస్‌లు స్పష్టం చేస్తున్నాయి. ఇథనాల్‌ను ఇంధనంతో కలపడం వల్ల పెట్రోల్‌లోని ఆక్టేన్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ధర కూడా తగ్గించాల్సి ఉంటుంది. చమురుసంస్ధలు వీటిని పట్టించుకోకుండా పెట్రోల్‌లో సుమారు 10 శాతం ఇథనాల్ కలిపి సరఫరా చేస్తూ ఫూర్తి ధరను కోట్ చేస్తున్నాయి.
వర్షకాల కష్టం
ఇథనాల్‌తో కూడిన పెట్రోల్ నిల్వలకు వర్షాకాలం కష్టం వచ్చి పడింది. వర్షకాలం నేపథ్యంలో ట్యాంకుల్లో కొద్ది పాటి నీరు చేరినప్పటికీ నిల్వలు క్రమంగా నీళ్లుగా మారుతున్నాయి. బంకుల నిర్వాహకులు అడుగు నిల్వలను సైతం వాహనాలకు పంపింగ్ చేస్తుండటంతో అవి కాస్తా మోరాయిస్తున్నాయి. స్టార్ట్ అయినా మధ్యలో ఆగిపోవడం తదితర సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలితంగా ఇంజిన్‌పై ప్రభావం పడుతోంది. నాలుగుచక్రాల వాహనాలకు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. దీంతో వాహనదారుల ఆందోళనకు దిగుతున్నా అధికారులు మాత్రం మొక్కుబడిగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
శాంపిల్స్‌కే పరిమితం: పౌరసరఫరాల అధికారులు పెట్రోల్ బంక్‌లలో శాంపిల్స్ సేకరించేందుకు పరిమితమవుతున్నారనే ఆరోపనలు వ్యక్తమవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ పెట్రోల్‌పై ఎప్పటికప్పుడు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారులు వద్ద కూడా పరీక్షలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులో ఉండాలి. అయితే అవీ అందుబాటులో ఉన్నా ఉపయోగించిన దాఖలాలు లేవు. పౌరసరఫరాల శాఖ తనిఖీలు నిర్వహించి రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్ పరీక్షకు పంపించిన శాంపిల్స్ వేళ్లపై లెక్కపెట్టవచ్చు.
►రెండు రోజుల క్రితం నగరంలోని జాతీయ రహదారిపై గల చైతన్యపురిలో హెచ్‌పీ పెట్రోల్ వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. బైక్‌లో పెట్రోల్ పోయించుకోగా స్టార్ట్ కాక మొరాయించడంతో అనుమానం వచ్చి ఖాళీ బాటిల్‌లో పోయించారు. బాటిల్ అడుగున నీరు ఉండటంతో బంక్ సిబ్బందిని నిలదీశారు. వారి నుంచి సరైన సమాధానం రాక పోవడంతో ఆందోళనకు దిగారు.
►గతంలోనూ హయత్‌నగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ లో నీళ్లతో కూడిన పెట్రోలు వచ్చిందని వాహనదారులు ఆందోళన చేపట్టారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పౌరసరఫరాల శాఖాధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించి చేతులు దులుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment