ప్రభుత్వం పంతాలకు పోవద్దు
మాజీ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్: మేడిగడ్డ వద్ద ప్రస్తుతం 40 వేల క్యుసెక్కుల నీరు ప్రవహిస్తోందని, ప్రభుత్వం పంతాలను మానుకొని నీటిని ఎత్తి పోయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బోనాల పండుగలో పాల్గొని కౌన్సిలర్ గుంటుకు శిరీష తెచ్చిన బోనమెత్తుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.
ఈ సమయంలో రిజర్వాయర్ల ద్వారా సాగు, తాగు అవసరాలకు గోదావరి జలాలను అందించాల్సిన అవసరముందని అన్నారు. మేడిగడ్డలో బ్యారేజీ గేట్లు తెరిచి ఉన్నా కూడా నదిలో ఉన్న ప్రవాహానికి అనుగుణంగా దాదాపుగా నాలుగు పంపులను నడిపి నీటిని ఎత్తిపోసే అవకాశముందని చెప్పారు.
మేడిగడ్డ నుంచి సుందిల్ల, అన్నారం, మిడ్‌మానేరు, అనంతగిరి రిజర్వాయర్ల మీదుగా సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీటిని నింపాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలను మానుకోవాలన్నారు.
నిరుద్యోగులను రెచ్చగొడతారా?
వారి సమస్యలను పట్టించుకోరా?
సీఎంకు హరీశ్ రావు బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగులు వారి న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తుంటే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్ రావు విమర్శించారు. పెద్ద మనసుతో వారి సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి తగదన్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చమని గ్రూప్స్, డీఎస్‌సీ అభ్యర్థులు, నిరుద్యోగులు నెత్తీనోరు కొట్టుకుంటుంటే ప్రభుత్వం ఎందుకు పరిష్కారం దిశగా ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల పోరాటం వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయంటూ నిందారోపణలు చేయడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు.
ఇలా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం వల్ల అభ్యర్థులు, నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం లభించదని, నిరాహార దీక్షలు చేస్తున్న వారెవరు కూడా పరీక్షలు రాయడం లేదని అపహాస్యం చేయడం వల్ల వారు శాంతించరని హరీశ్ అభిప్రాయపడ్డారు. కంచెలు, ఆంక్షలు విధించి నిరుద్యోగుల గొంతులను నొక్కాలనుకున్న మీ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో హరీశ్ స్పష్టం చేశారు. నిరుద్యోగుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని సానుకూల దృక్పథంతో చర్చలకు ఆహా్వనించాలని కోరారు.
నాడు వైఎస్ చేసినట్టుగా చేయండి..
హరీశ్ ఏడు ప్రధాన డిమాండ్లను ఆ లేఖలో ప్రస్తావించారు. గ్రూప్1లో 1:100 నిష్పత్తితో అభ్యర్థులను అనుమతించాలని, గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారని గుర్తు చేశారు.
ఇటీవల ఏపీలో నిర్వహించిన గ్రూప్2 నోటిఫికేషన్‌ను సవరించి 1:100కు మార్చారని తెలిపారు. గ్రూప్2 ,గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచాలని, 25వేలతో మెగా డీఎస్‌సీ వేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment