కొణిజర్ల : ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండల కేంద్రంలో శాంతినగర్ టీచర్స్ కాలనీలో ఓ ఉపాధ్యాయురాలు సోమవారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వివరాల ప్రకారం.. దిద్దుపూడికి చెందిన లింగాల కుమారి అలియాస్ హర్షిత(40) తొర్రూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ శాంతినగర్ టీచర్స్ కాలనీలో నివాసముంటోంది.
కాగా, భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న ఆమె తెల్లవారుజామున అస్వస్థతగా ఉందంటూ, అదే కాలనీకి చెందిన మక్కా నరసింహారావు.. కుమారి సోదరుడైన భాస్కరరావు భార్యకు ఫోన్‌లో చెప్పి తన కారులోనే వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాగా, కుమారి బంధువులు వచ్చేలోగా ఆమె మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.
అయితే, కుమారి వద్ద మక్కా నరసింహారావు వడ్డీకి డబ్బు తీసుకుని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, ఆదివారం ఇదే విషయమై నిలదీయడంతో నరసింహారావుతో పాటు ఆయన భార్య, తమ్ముడు కలిసి కొట్టినట్లు కుమారి దత్త పుత్రిక ఐదేళ్ల సైనీ తెలిపినట్లు ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యయాతి రాజు తెలిపారు.
మరోవైపు, కుమారి తన భర్తతో విడిపోయి కొన్నేళ్లుగా నరసింహారావుతో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం. వీరి మధ్య ఆర్థిక లావాదేవీలతో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక, ఆమె బాలిక సైనీను దత్తత తీసుకుని పెంచుతుండగా, ఇప్పుడు కుమారి మృతితో బాలిక ఒంటరిగా మిగిలింది. దీంతో, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment