కనకరాజు (ఫైల్)
కొండపాక(గజ్వేల్): మల్లన్నసాగర్ ముంపు గ్రామ మైన ఎర్రవల్లిలో అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండుప్రాణం బలైంది. రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేత చేపట్టిన క్రమంలో విద్యుత్ స్తంభం కూలి మీద పడటంతో ఓ యువకుడు మృతి చెందారు. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక, తొగుట మండలాల సరిహద్దులోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి ఆదివారం తెల్లవారుజామున గోదావరి నీటి తరలింపునకు ట్రయల్‌రన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎర్రవల్లిలో అధికారులు గుట్టుచప్పుడుకాకుండా ఇళ్లు కూల్చివేత చేపట్టారు. గజ్వేల్ మండలం ముట్రాజ్‌పల్లి శివారులోని డబుల్ బెడ్‌రూం ఇళ్లల్లో ఉంటున్న బాధితులు విషయం తెలుసుకొని శనివారంరాత్రి ఎర్రవల్లికి వచ్చి తమ ఇళ్లల్లోని సామాన్లను సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ క్రమంలో ఆరె కనకరాజు(28) తన ఇంట్లోంచి సామాన్లను బయటకు తీస్తుండగా ఆ పక్కనే ఇంటిని కూల్చివేస్తున్న జేసీబీ సమీపంలోని విద్యుత్‌స్తంభానికి బలంగా తగిలింది. దీంతో కరెంట్ తీగలు తెగిపోయి కనకరాజుపై స్తంభం పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో వెంటనే కనకరాజును అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యు లు ధ్రువీకరించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల కూల్చి వేత పనులెలా చేపడతారంటూ ఉస్మా నియా ఆస్పత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగారు. కనకరాజు కుటుంబానికి రూ.20 లక్షలు, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ అధికారులు హామీనిచ్చే వరకు పోస్టుమార్టం చేయనివ్వబోమంటూ పట్టుబట్టారు. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్‌రెడ్డి ఆసుపత్రి వద్దకు వెళ్లి బాధితకుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చూస్తామంటూ హామీనివ్వడంతో శాంతించారు. మృతుడికి రెండు న్నరేళ్ల కూతురు ఉంది. భార్య శ్యామల 4నెలల గర్భవతి.
ఎర్రవల్లిలో నేలమట్టమైన ఇళ్లు
ఎర్రవల్లిలో విషాదం
ఎర్రవల్లికి చెందిన ఆరె నర్సయ్య– లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. నర్సయ్య చిన్న కుమారుడే కనకరాజు. వారికున్న ఎకరం భూమిలో వర్షాధార పంటలే పండటంతో కనకరాజు బతుకుదెరువు కోసం హైదరబాద్‌కు వెళ్లాడు. ఊరు ముం పునకు గురవుతుందని తెలుసుకున్న ఇటీవల తిరిగి ఎర్రవల్లికి చేరుకొని కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment