దేవదాసు (ఫైల్)
గజ్వేల్/గజ్వేల్ రూరల్: ‘న్యాయంగా దక్కాల్సిన ఓపెన్ ప్లాట్ ఇవ్వాలని అడిగితే లంచమడుగుతున్నరు. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన. ఇక సచ్చిపోతున్న’ అంటూ తల్లికి ఫోన్‌లో చెప్పి మల్లన్నసాగర్ ముంపు బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో శనివారం ఈ విషాద సంఘటన జరిగింది.
రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి తిరిగి..
తొగుట మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గొడుగు కిష్టయ్యకు ముగ్గురు కుమారులు రాజబాబు, దేవదాసు, రాజు ఉన్నారు. గ్రామంలో తండ్రితో పాటు ముగ్గురికి సంబంధించిన 1.18 ఎకరాల భూమి, ఇతర ఆస్తులను మల్లన్నసాగర్ కింద కోల్పోయారు. పరిహారం కింద అందరికీ కలిపి రూ.48.74 లక్షలు అందాయి. గ్రామం ఖాళీ అయ్యాక తండ్రి కిష్టయ్యకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాగా ఆయన ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఉంటున్నాడు.
ముగ్గురిలో రాజబాబు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. రెండో కుమారుడు దేవదాసు.. ఇటీవల అప్పు చేసి పట్టణంలో సుమారు 60 గజాల స్థలంలో చిన్నపాటి ఇల్లు నిర్మించుకొని అక్కడే ఉంటున్నాడు. తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఓపెన్ ప్లాట్ కోసం నెలల తరబడి సిద్దిపేట ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. శుక్రవారమూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు దళారులు రూ.3 లక్షలు లంచమిస్తే పనవుతుందని.. లేదంటే ప్లాట్ రాకుండా చేస్తామని బెదిరించారు. దీంతో ప్లాట్ రాదేమోనని మనస్తాపం చెందాడు.
ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి..
వెంటనే వస్తానని భార్య స్వప్నకు చెప్పి శుక్రవారం రాత్రి దేవదాసు బయటకు వెళ్లాడు. రాత్రి 11 దాటినా ఇంటికి రాకపోవడంతో ఆందోళనతో స్వప్న కుటుంబీకులకు చెప్పింది. ఆ సమయంలో దేవదాసు తన తల్లికి ఫోన్ చేసి ‘ప్లాట్ కోసం ఎంత తిరుగుతున్నా వస్తలేదు.. బ్రోకర్లు లంచమడుగుతున్రు. ఇగ నేను సచ్చిపోతా’నని ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఆచూకీ లభించలేదు. తెల్లవారుజామున రాజిరెడ్డిపల్లి మార్గంలో ఓ చెట్టుకు ఉరేసుకొని శవమై కనిపించాడు.
స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దేవదాసు ఆత్మహత్యకు దళారులే కారణమంటూ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఆర్డీవో వచ్చే వరకు కదిలేది లేదని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంపై సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డిని వివరణ కోరగా దేవదాసుకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూ.7.5 లక్షలు, ఇల్లుకు సంబంధించిన రూ. 5. 04 లక్షలు అందించామని, ఓపెన్ ప్లాటు వ్యవహారం పెండింగ్‌లో ఉందని తెలిపారు. దేవదాసు చాలా కాలంగా స్థానికంగా ఉండకపోవడం వల్లే ప్లాటు పెండింగ్‌లో పడిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment