సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు పెరిగిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని, రైతు వ్యతిరేక చర్యలతో వారి ఉసురు తీస్తోందని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. మూడేళ్ళలో 70 వేలమంది రైతులు చనిపోతే ఇందులో 9 వేలమందివి ఆత్మహత్యలేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన ప్రతీ రైతుకు రైతుబీమా కింద రూ.5 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు షర్మిల రాసిన లేఖను మీడియా ముందుంచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 59 ఏళ్ళు దాటిన రైతుకు బీమా సదుపాయం కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. బీమా రైతుకా? వయసుకా? అని ఆమె ప్రశ్నించారు. తన లేఖపై స్పందించని పక్షంలో రైతు పక్షాన ఆందోళనలు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. పార్టీ గుర్తింపుపై ఎందుకు కొర్రీలు పెడుతున్నారో ఎన్నికల సంఘమే తెలపాలని ఆమె ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment