పక్కా పథకం ప్రకారమే కదా దాడులు?
వాహనం వెళ్లేందుకు అవకాశమున్నా ఆగారు కదా?
ఆయుధాలు అదే సమయానికి ఎలా వచ్చాయి?
ముట్టుకోవద్దు.. ఆధారాలు చెరిగిపోతాయని ఎందుకన్నారు?
ఇనుపరాడ్‌తో కొట్టినా పోలీసులు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
పచ్చమూక విధ్వంసకాండపై పలు అనుమానాలు
టీడీపీ మూకల విధ్వంసాలపై కుట్రకోణం దాగి ఉందా..? పక్కా ప్లాన్‌తోనే అల్లర్లకు తెగబడ్డారా..? ఓటమి భయంతోనే దాడులకు పాల్పడ్డారా..? పథకం ప్రకారమే చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పచ్చముఠా చెలరేగిపోయిందా..? మహిళా వర్సిటీ వద్ద పులివర్తి నాని కావాలనే రెచ్చిపోయారా..? 144 సెక్షన్ అమలులో ఉన్నా వైఎస్సార్‌సీపీ శ్రేణులను కవ్వించేందుకే మారణాయుధాలు చేతపట్టిన గ్యాంగ్‌తో అక్కడకు వచ్చారా..? ఎలాంటి గాయం కాకపోయినా కేవలం సానుభూతి కోసమే నాటకాలాడారా..? ధర్నాలో కూర్చున్నప్పుడు నిక్షేపంగా కనిపించిన నాని.. అంతలోనే ఎందుకు అస్వస్థతకు గురయ్యారు..? సిట్ అధికారులను తప్పుదోవ పటించేందుకే వంటి నిండా కట్టుకట్టించుకున్నారా..? నాటి ఘటనకు సంబంధించిన ఆడియో.. వీడియోలను పరిశీలిస్తే అవుననే అర్థమవుతోంది. పోలింగ్ రోజు.. మరుసటి రోజు దాడుల వెనుక కక్షపూరిత పథకం దాగి ఉందని స్పష్టమవుతోంది.
సాక్షి తిరుపతి : శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన విధ్వంస కాండలో టీడీపీ నేతలు, పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ రోజు నుంచి మరుసటి రోజు వరకు జరిగిన దాడుల వెనుక కుట్ర కోణం దాగి ఉందని విచారణ అధికారులు సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియోలు, వీడియోలు పరిశీలిస్తే మొత్తం ఘటనలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, అనుచరులు, గన్‌మన్, మరో నలుగురు పోలీసుల పాత్ర ఉన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజక వర్గంలోనే ఈ విధ్వంసాలు చోటు చేసుకోవటం వెనుక టీడీపీ నేతలు, కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు సిట్ అధికారులు తన నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది.
పోలింగ్ రోజున రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాలువ, చంద్రగిరి మండలం కాశిపెంట్ల, చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె పరిధిలోని కందులవారిపల్లె, పాకాల మండలం ఆదినపల్లె పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై టీడీపీ నేతలు దాడులకు తెగబడిన విషయం విధితమే. అదే రోజు రాత్రి రామిరెడ్డిపల్లెలో సర్పంచ్ ఇంటిని పచ్చగూండాలు తగులబెట్టారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డి కారుకి నిప్పుపెట్టారు. మరో కారుని ధ్వంసం చేశారు. అంతటితో ఆగని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, అనుచరులు ఈవీఎంలను భద్రపరచిన మహిళా యూనివర్సిటీ వద్ద మరింతగా రెచ్చపోయారు. ఈ విధ్వంసం అంతా పక్క ప్లాన్ అనడానికి వెలుగులోకి వచ్చిన వీడియోలు, ఆడియోలే నిలువెత్తు సాక్ష్యం.
అందుకే కెమెరాలు అమర్చుకున్నారా?
దాడులన్నీ ముందస్తు ప్రణాళికలో భాగమేనని తెలుస్తోంది. కొటాలలో జరిగిన ఘర్షణలకు ముందే పులివర్తి నాని, అనుచరుల వాహనాలకు కెమెరాల అమర్చుకొని విధ్వంసాలకు తెగబడినట్లు సమాచారం. దాడుల తర్వాత రోడ్డుపై పడి ఉన్న బీరు బాటిళ్లు, రాళ్లు, రాడ్లు తీసేసేందుకు కొందరు ప్రయత్నిస్తుంటే.. పులివర్తి నాని గన్‌మన్ కల్పించుకుని ‘వాటిని తాకొద్దు. అవి ఎవిడెన్స్’ అంటున్నాడే తప్ప వీఐపీ ఎక్కడున్నాడో అతని వద్దకెళ్దామనే ఆలోచన కూడా చేయలేదని తెలుస్తోంది. గన్‌మన్‌కి ఎవిడెన్స్‌తో పనేంటి? పోలీసులు చూసుకుంటారు కదా? ఇదిలా ఉంటే.. వీఐపీ మీద దాడి జరుగుతుందని తెలిసిన వెంటనే స్థానిక డీఎస్పీ లేదా సీఐకి సమాచారం ఇవ్వాలి. ఇది చెయ్యకుండా.. సాక్ష్యాలు అంటూ వాటి కోసం కెమెరాలు ఏర్పాటు చేసుకుని, వస్తువులను తాకొద్దని మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటి? దాడి జరిగిందన్నారు, ఆ తర్వాత ధర్నాకు కూర్చున్నారు. ఆ సమయంలో చేతులు, కాళ్లు బాగానే ఉన్నాయి. సుమారు రెండు గంటల తర్వాత గాయాలైనట్టు ఆస్పత్రిలో చేర్చారు. చేతికి, కాలికి కట్లు కట్టుకున్నారు బాగానే ఉంది. రెండు రోజులకే గాయాలు నయమైపోయాయా? సాక్షి పత్రికలో ఫొటోలతో ప్రచురించాక.. మళ్లీ చేతికి, కాలికి కట్లు కనిపించాయి. ఆ కట్లతోనే సిట్ అధికారులకు వినతి పత్రం ఎలా ఇచ్చారు నాని అన్నయ్య గారూ? విధ్వంసాల వెనుక ఎవరి హస్తం ఉందో నిగ్గుతేల్చి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
దాడికి ప్రతి దాడి ఏ చట్టం చెప్పింది?
మహిళా యూనివర్సిటీ వద్ద టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైఎస్సార్‌సీపీ నాయకులు దాడులు చేశారని ప్రధాన ఆరోపణ. ఆ దాడిలో తన చేయి, కాలికి తీవ్ర గాయం అయినట్లు ఆస్పత్రిలో చేరి కట్లు కట్టుకుని నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. అయితే నానిపై దాడి జరగలేదు.. ఆయన చేయి, కాలికి ఎలాంటి గాయాలు కాలేదు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఇదంతా పులివర్తి నాని, కొందరు పోలీసులు పథకం ప్రకారం చేసిన అరాచకమని ఆడియో, వీడియో రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉన్నా అంత మంది రాడ్లు, బీరు బాటిళ్లు, కర్రలు, రాళ్లతో అక్కడికి చేరుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పులివర్తి నాని ప్రయాణిస్తున్న కారు మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నట్లుండి ఆగింది.
కారు వెనుక గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కారుపై దాడి చేసే సమయంలో పులివర్తి నానిని గన్‌మన్ సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లమని డ్రైవర్‌కి ఆదేశాలు ఇవ్వాలి. వీఐపీని కాపాడుతూ.. తనను తాను కాపాడుకోవాల్సిన బాధ్యత గన్‌మన్ తక్షణ కర్తవ్యం. అలా కాకుండా వాహనాన్ని ఎందుకు ఆపారు? దాడి జరిగే సమయంలో గన్‌మన్ ఎందుకు కారు ఎందుకు దిగాల్సి వచ్చింది? అపాయాన్ని పసిగట్టిన గన్‌మన్ వెంటనే పులివర్తి నానిని అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలి. అయితే అక్కడ కారు ఆపి ఎందుకు ప్రతిదాడికి దిగాల్సి వచ్చింది? ముందు గన్‌మన్, తర్వాత పులివర్తి నాని కారు దిగి పరుగెత్తడం వీడియోల్లో కనిపించింది.
దాడి జరిగే సమయంలో అక్కడి నుంచి సురక్షితమైన ప్రాంతానికి వెళ్లేందుకు ఎటువంటి ఆటంకాలు లేవు. నాని కారు దిగి అటువైపు వెళ్లిన కొద్ది సేపటికే తుపాకీ కాల్పుల మోత వినిపించింది. ఈ క్రమంలోనే తుపాకీతో పులివర్తి నాని కాల్చారు అనటానికి ఆడియో రికార్డు ఒకటి బయటపడింది. నాని అనుచరుడా? గన్‌మన్ ? ఇద్దరిలో ఒకరు వేరొకరికి ఫోన్‌చేసి ‘ఇక్కడ గొడవ జరుగుతోంది. అన్న ఫైర్ చేశాడు. వెంటనే అందరూ రండి’ అని పిలుపు నివ్వడం ఆడియోలో వినిపించింది. తుపాకీ ఫైర్ అయిన సమయంలో గన్‌మన్ వేలికి గాయమైనట్లు తెలుస్తోంది. పులివర్తి నాని తుపాకీ పేల్చలేదు అనుకుంటే.. వేలికి గాయమైన గన్‌మన్ ఎలా ట్రిగర్ నొక్కి గాల్లోకి కాల్పులు జరుపుతారు? వైఎసా్‌స్‌ర్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టి అటాక్ చేయించుకునే విధంగా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment