
ఏదీ ఆవిర్భావ శోభ!
● తిరుపతి పుట్టిన రోజును విస్మరించిన కూటమి ప్రభుత్వం
● టీటీడీ, కార్పొరేషన్ తీర్మానాన్ని
పట్టించుకోని పాలకులు
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
సాక్షి, ప్రతినిధి తిరుపతి: ప్రపంచంలోనే ఏ నగరానికీ లేనంత గుర్తింపు తిరుపతి నగరానికి మాత్రమే ఉంది. ఆధ్యాత్మిక కేంద్రమైనా తిరుపతికి పుట్టిన రోజు జరుపుకునే అవకాశం ఉంది. సద్గురు శ్రీరామానుజాచార్యులు స్వహస్థాలతో 1130 ఫ్రిబవరి 24న శంకుస్థాపనతో.. నేటి తిరుపతిని నాడు గోవిందరాజపురంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి తిరుపతికి పుట్టిన రోజు నిర్వహించేవాళ్లు. పూర్వీకుల తదనంతరం తిరుపతి పుట్టిన రోజును మరిచారు.
నూతన ఒరవడికి శ్రీకారం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయంలో నాటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తిరుపతి పుట్టిన రోజు చరిత్రను తెలుసుకొని నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కరోనా కారణంగా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించలేకపోయినా.. ఆ తర్వాత జన్మదిన వేడుకలను సంప్రదాయంగా బద్ధంగా, అంగరంగవైభవంగా నిర్వహిస్తూ వచ్చారు. శ్రీవారి పాదాల చెంత విస్తరించిన ఈ మహానగరానికి జన్మదిన వేడుకలను నిర్వహించాలని నాటి టీటీడీ పాలకమండలి, తిరుపతి నగర పాలక సంస్థలు తీర్మానం కూడా చేశారు. ప్రతి ఏటా తిరుపతి మహానగరం జన్మదిన వేడుకలు నిర్వహించాలని గత పాలకులు, అధికారులు నిర్ణయించారు.
నాడు కళకళ
నేడు వెలవెల
తిరుపతి పుట్టిన రోజుకు రాజకీయ గ్రహణం
రెండేళ్ల క్రితం ప్రతిష్టాకరంగా మొదలైన తిరుపతి పుట్టినరోజుకు రాజకీయ గ్రహణం పట్టింది. తిరుపతి గ్రామ దేవత గంగమ్మగుడి పునర్నిర్మాణం పనుల సందర్భంగా బయటపడిన శిలాఫలకం ఆధారంగా 2022 ఫిబ్రవరి 24వ తేదీన తిరుపతి 893వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చొరవతో టీటీడీ, తిరుపతి నగరపాలక సంస్థల సహకారంతో రాజకీయాలకు అతీతంగా రెండేళ్ల పాటు ఉత్సవాలను నిర్వహించారు. ఎవరు ఉన్నా ఆ ఉత్సవాలను కొనసాగించే లక్ష్యంతో నిరంతరాయంగా నిర్వహించాలని టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేసింది. నగర పాలక సంస్థ కూడా ఉత్సవాల నిర్వహణకు తీర్మానం చేసింది. అది వ్యక్తిగతం, రాజకీయ కార్యక్రమం కాదు కనుక అప్పటి ప్రతిపక్ష పార్టీల వారు కూడా తిరుపతి పుట్టినరోజు ఉత్సవాలను వ్యతిరేంచ లేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుపతి పుట్టినరోజును పట్టించుకునే వారు కరవయ్యారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయంలో నాటి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరం పుట్టిన రోజు వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరం మొత్తం మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. ఆధ్యాత్మిక శోభయాత్రను చేపట్టారు. భక్తజన గోవింద నామ సంకీర్తనలు, భజన మండళ్ల కోలాటాలు, పండరి భజనలు, చెక్కభజనలు, కళాబృందాల లయబద్ధ నృత్యాలు, సకల దేవతామూర్తులు, సప్తమహర్షులు, జగద్గురుల వేషధారణలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ఎక్కడ చూసినా భక్తి చైతన్యమే వెల్లివిరిసింది. గోవిందరాజపురంగా ఏర్పడి.. తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుట్టిన రోజు సందర్భంగా నగరం మొత్తం కళకళలాడింది.
తిరుపతి నగరానికి ఉన్న విశిష్టత ఏ నగరానికీ లేదనేది జగమెరిగిన సత్యం. అటువంటి నగరం పుట్టిన రోజు వేడుకలను నేటి కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యే విస్మరించారు. సనాతన ధర్మానికి మహా పురుషులు తామేనన్ని, హిందుత్వమంటే తమదేనని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని జబ్బలు చరుచుకునే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకు ఆధ్యాత్మిక నగర పుట్టిన రోజు గుర్తురాలేదంటూ.. తిరుపతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మీ హిందూ ధర్మమని మండిపడుతున్నారు.

ఏదీ ఆవిర్భావ శోభ!
Comments
Please login to add a commentAdd a comment