
అరాచకాలపై పోరాటం
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వ అరాచకాలపై రాజీ లేని పోరాటం సాగించాలని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పద్మావతిపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ పదవులను బాధ్యతగా స్వీకరించి పనిచేయాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందడుగు వేయాలని సూచించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఈ విషయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని స్పష్టం చేశారు. కూటమి నేతల దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని, జగనన్నతోపాటు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జగనన్నకు వస్తున్న జనాదరణకు ఆకాశమే హద్దని తెలిపారు. ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment