రూ.5 కోట్ల భూమి హాంఫట్!
● జాతీయ రహదారి పక్కనే మూడు ఎకరాలు కబ్జా ● చదును చేసిన కూటమి నేతలు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : చిల్లకూరు మండలంలోని చైన్నె– కలకత్తా జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16) పక్కనే ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములపై కూటమి నేతల కన్నుపడింది. తలచిందే తడువుగా రూ.5 కోట్ల భూమిని ఆక్రమించేశారు. ఆపై యథేచ్ఛగా చదును చేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అంతా గోప్యం
ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలోని రైటార సత్రంలోని ఓ హోటల్‌కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిపై కన్నెసిన ప్రజాప్రతినిధి ఆ భూమిని దక్కించుకునేందుకు పావులు కదిపారు. రెవెన్యూ యంత్రాంగాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుని అది పట్టాభూమి అని చెప్పించారు. అక్కడ ఉన్న ఒకే సర్వే నంబర్ ప్రకారం సుమారు 100 ఎకరాలకు పైగా భూములు ఉండగా.. ఇందులో ఎంత మేర సీలింగ్‌కు వదిలారు.. ఎంత మేర యజమానుల చేతిలో ఉన్నాయి అనే విషయాలను గోప్యంగా ఉంచారు. తనకు దగ్గరగా ఉండే ముత్యాలపాడుకు చెందిన నాయకుడిని సదరు ప్రజాప్రతినిధి రంగంలోకి దింపడంతో ఆయన రాత్రికి రాత్రే సుమారు వంద టిప్పర్ల మట్టిని తోలి చదును చేశారు.
బీజేపీ నాయుకుడి ఫిర్యాదు
జాతీయ రహదారి పక్కనే విలువైన భూములు అన్యాక్రాంతం కావడంపై తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బైరప్ప కేంద్ర రహదారుల శాఖా మంత్రికి లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అలాగే స్థానికంగా ఉండే సబ్ కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు అందించారు.
అవి పట్టా భూములు
ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలో రైటార్ సత్రం వద్ద జాతీయ రహదారి పక్కనే ఉన్న సుమారు మూడు ఎకరాల భూమిలో మట్టి తోలి చదును చేస్తున్న వారు ఎవరు అనే విషయం తెలియదు. అయితే ఈ భూములు పట్టా భూమి కావడంతో వాటిపై దృష్టి పెట్టలేదు. అయినా వీఆర్‌ఓను పంపి విచారణ చేయిస్తా. – శ్రీనివాసులు,
తహసీల్దార్, చిల్లకూరు మండలం
ఆ మూడు ఎకరాలకు స్కెచ్
పాత మద్రాసు హైవే రోడ్డుకు 50 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో నేడు ఉన్న జాతీయ రహదారిని పడమర వైపు నిర్మించారు. ఈ రెండు రోడ్లకు మధ్యలో సుమారు మూడు ఎకరాల భూమి ఉంది. రహదారి నిర్మాణంలో భాగంగా రెండు రోడ్లకు మధ్య లో ఉన్న భూమిలో కాలువలు ఉండేవి. వర్షం వచ్చినప్పుడు రోడ్డుపై ప్రవహించే నీరు ఈ కాలువల ద్వారా ముత్యాలపాడు చెరువుకు చేరేది. ఈ రెండు రోడ్లకు మధ్యలో ఉన్న మూడు ఎకరాల భూమికి కూటమి నేతలు స్కెచ్ వేశారు. రాత్రికిరాత్రే ఆ భూమిలోని కాలువలను పూడ్చి చదును చేశారు.
రూ.5 కోట్ల భూమి హాంఫట్!
Comments
Please login to add a commentAdd a comment