కల్తీ నెయ్యి కేసులో ముగిసిన కస్టడీ | - | Sakshi
Sakshi News home page

కల్తీ నెయ్యి కేసులో ముగిసిన కస్టడీ

Published Fri, Mar 7 2025 9:14 AM | Last Updated on Fri, Mar 7 2025 9:14 AM

-

తిరుపతి లీగల్‌: తిరుమలకు కల్తీ నెయ్యి తరలిస్తున్నారన్న అభియోగాల కింద నమోదైన కేసులో ఇద్దరికి మూడు రోజుల కస్టడీ గురువారంతో ముగిసింది. దీంతో కేసులో మూడవ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైష్ణవి డెయిరీ డైరెక్టర్‌ విపిల్‌ జైన్‌, 5వ నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ వినయకాంత్‌ చావడాలను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి ఇస్తూ తిరుపతి రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోటేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పోలీసులు వారిని జుడిషియల్‌ కస్టడీ నుంచి తమ కస్టడీకి తీసుకుని విచారించారు. గురువారంతో కస్టడీ కాలం ముగియడంతో పోలీసులు ఇద్దరినీ తిరిగి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఇద్దరినీ తిరిగి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీచేశారు. కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లపై సోమవారం వాదనలు జరగనున్నట్లు తెలిసింది.

ఉరేసుకుని వృద్ధురాలి మృతి

రేణిగుంట(శ్రీకాళహస్తి రూరల్‌): మామిడి చెట్టుకు ఉరేసుకుని వృద్ధురాలు మృతిచెందిన ఘటన రేణిగుంట మండలం, వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన గురవయ్య భార్య సరస్వతి(75) వెదుళ్లచెరువు ఎస్టీ కాలనీలోని తన చిన్నకుమార్తె యశోద ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదు. అయితే గురువారం ఉదయం యశోద, ఆమె కుమారుడు ఆవుల దినకర్‌ కలసి గంగిరెడ్డిపల్లిలోని బంధువుల ఊళ్లో కర్మక్రియలకు వెళ్లారు. ఈ క్రమంలో 11గంటల సమయంలో ఎస్టీ కాలనీలోని వారు ఫోన్‌ చేసి సరస్వతి మామిడి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందిందినట్టు సమాచారం అందించారు. ఎవరికీ భారం కాకూడదని భావించి మామిడి చెట్టు కొమ్మకి చీరతో ఉరి వేసుకొని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. రేణిగుంట అర్బన్‌ ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దళారీ అరెస్ట్‌

తిరుమల : టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఫొటోలను వాట్సాప్‌ డీపీగా పెట్టుకుని, చైర్మన్‌ పీఆర్వో అని నమ్మిస్తూ శ్రీవారి సేవా, దర్శన టికెట్లు ఇప్పిస్తామని మోసగిస్తున్న ఘరానా మోసగాడిని తిరుమల టూటౌన్‌ పీఎస్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. టూటౌన్‌ పీఎస్‌ సీఐ శ్రీరాముడు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరికి చెందిన ఫరూక్‌ అలియాస్‌ ప్రసాద్‌(35) ప్రస్తుతం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరులో నివాసం ఉంటున్నాడు. ఇతను గత నాలుగు నెలల నుంచి ‘తిరుమల సమాచారం’ అనే వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేసి అందులో సుమారు 600 మందిని సభ్యులుగా చేర్చి తిరుమలలో శ్రీవారి దర్శనం కావాలంటే తనను సంప్రదించండి అని మేసేజ్‌లు రాసి పోస్ట్‌ చేసేవాడు. దాన్ని నమ్మిన గ్రూప్‌లోని భక్తులు అతన్ని వాట్సాప్‌ కాల్‌ ద్వారా కాంటాక్ట్‌ అవుతారు. దీంతో నిందితుడు వారికి దర్శనం ఇప్పిస్తామని చెప్పి వారి వద్ద నుంచి ఫోన్‌ పే ద్వారా నగదు వేయించుకుని మోసగించేవాడు. ఈ విధంగా సుమారు రూ.80వేలు తీసుకుని మోసగించాడు. నిందితుడిపై చంద్రగిరి పోలీస్‌ స్టేషన్‌లో మూడు కేసులు ఉండగా ఇందులో మూడు నెలలు జైలు శిక్షను సైతం అనుభవించాడు. పోలీసులు చాకచక్యంగా ప్రసాద్‌ను అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి సెల్‌ఫోన్‌, ఆరు సిమ్‌ కార్డులు, బ్యాంక్‌ పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

దళారులను నమ్మి మోసపోకండి

భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారులు నమ్మి మోసపోవద్దని సీఐ శ్రీరాముడు సూచించారు. ఎవరైనా దళారులను గుర్తిస్తే వారి వివరాలను తీసుకుని తిరుమల పోలీసులను 0877–2289027లో సంప్రదించాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement