ఇసుక ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి
చంద్రగిరి: ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమై ట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన ఓ యువ నాయకుడిది కావడం గమనార్హం. దీంతో సదరు ట్రాక్టర్‌ను పోలీసు శాఖలోని ఓ అధికారి తప్పించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. తిరుపతి రూరల్ మండలం, మల్లవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ కుమారుడు చాణక్య(25) శుక్రవారం రాత్రి మల్లయ్యపల్లి నుంచి తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. అదే సమయంలో చంద్రగిరి నుంచి మల్లయ్యపల్లి మార్గంలో ఇసుక ట్రాక్టర్ వేగంగా వస్తూ ఇందిమ్మ కాలనీ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చాణక్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇసుక ట్రాక్టర్ చంద్రగిరి పట్టణానికి చెందని టీడీపీలోని ఓ యువనాయుకుడిదిగా గుర్తించారు. అధికార బలంతో ఆ యువ నాయకుడు ఘటనా స్థలం నుంచి ట్రాక్టర్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. రాత్రి 10.30 గంటలైనా పోలీసులు ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించలేదు. ట్రాక్టర్‌ను తప్పించి, మరొక ట్రాక్టర్‌ను చూపించేందుకు అధికార పార్టీ నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఎస్‌ఐ అనితను వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్‌లో ప్రయత్నించగా ఆమె స్పందించ లేదు. అనంతరం సీఐ సుబ్బరామిరెడ్డిని వివరణ కోరగా.. చంద్రగిరికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడి ట్రాక్టర్‌గా గుర్తించామని, ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment