తాగునీటి సమస్యపై దృష్టి
తిరుపతి అర్బన్: వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యలు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తోపాటు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌తో కలసి అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ టీటీడీ నిధులతో చేపట్టాల్సిన ఎండీ పుత్తూరు నుంచి మంగళం వరకు తాగునీటి పైపులైన్ పనులు వేగవంతం చేయాలన్నారు. పైప్‌లైన్ ఏర్పాటుకు చెందిన మ్యాప్‌ను అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, ఏపీఐఐసీ తిరుపతి జోనల్ మేనేజర్ విజయ్‌భరత్‌రెడ్డి, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాంబాబు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌ఈ శ్యామ్‌సుందర్, ఈఈ తులసీకుమార్ పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షకు 597 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మ్యాథ్స్–2ఏ, బోటనీ–1, సివిక్స్–1 సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 28,639 మంది, ఒకేషనల్‌లో 1,059 మంది మొత్తం 29,698మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 597మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం ప్రథమ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–1బీ, జువాలజీ–1, హిస్టరీ–1 సబ్జెక్టుల్లో జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ పేర్కొన్నారు.
ఓటేరు చెరువును రక్షించండి
తిరుపతి అర్బన్: తిరుపతి రూరల్ మండలం, జాతీయ రహదారి సమీపంలోని ఓటేరు చెరువును ఆక్రమణల నుంచి రక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. పారదర్శకంగా ఉంటామని ఓ వైపు ముఖ్యమంత్రి చెబుతుంటే ఇలా చెరువులను ఆక్రమించడం ఏంటని మండిపడ్డారు. తప్పును తప్పుగానే తాము చూస్తామని వెల్లడించారు. చెరువులను కాపాడడం కోసం సీపీఐ, సీపీఎం పోరాటాలు చేస్తుంటే తమపై శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. మరోవైపు ఓటేరు సమీపంలోనే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కార్యాలయం ఉందని, ఇప్పటి వరకు ఆయన స్పందించకపోవడం సరికాదన్నారు.
క్రీడలతోనే క్రమశిక్షణ సాధ్యం
తిరుపతి సిటీ: ఉద్యోగుల్లో టీమ్ వర్క్, క్రమశిక్షణ క్రీడలతోనే సాధ్యమని పోస్ట్ మాస్టర్ జనరల్ కే.ప్రకాష్, 2024 క్యారమ్స్ ప్రపంచ చాంపియన్ కొమరపల్లి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక స్మార్ట్ సిటీ ఇండోర్ స్డేడియంలో జరిగిన 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్స్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. దేశంలోని 13 రాష్ట్రాల నుంచి 108పైగా ఉద్యోగులు క్యారమ్స్ పోటీలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. పురుషుల ఓవరాల్ చాంపియన్స్‌గా తమిళనాడు జట్టు నిలవగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర దక్కించుకున్నాయి. మహిళల ఓవరాల్ చాంపియన్స్‌గా మహారాష్ట్ర ప్రథమ స్థానం, ద్వితీయ, తృతీయ స్థానాలలో వెస్ట్‌బెంగాల్, తెలంగాణ నిలిచాయి. ఉమెన్స్ సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను సాధించిన ఉద్యోగులకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్విసెస్ ఏపీ సర్కిల్ సంతోష్‌నేతా, మంజుకుమార్, తిరుపతి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బీ.నరసప్ప, పోస్టల్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
తాగునీటి సమస్యపై దృష్టి
తాగునీటి సమస్యపై దృష్టి
Comments
Please login to add a commentAdd a comment