ప్రజలతోనే పదిహేనేళ్లు
తిరుపతి మంగళం : వైఎస్సార్‌సీపీ గత పదిహేనేళ్లుగా ప్రజలతో మమేకమై ముందుకు సాగుతోందని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి మారుతీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లపాటు జనరంజకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిందన్నారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అందించి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. నిరుపేద విద్యార్థులు సైతం ఉన్నతంగా చదువుకోవాలనే సంకల్పంతో మహానేత వైఎస్సార్ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. తండ్రిక తగ్గ తనయుడిగా జగన్‌మోహన్‌రెడ్డి సైతం మహోన్నత పథకానికి మరింత మెరుగులు దిద్ది పకడ్బందీగా కొనసాగించారని వెల్లడించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్నా ఫీజురీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పేరుతో నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థుల బతుకులతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను నిర్వీర్యం చేస్తూ ఆడపడుచులను మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను గాలికి వదిలేసి, వైఎస్సార్‌సీపీ నేతలను జైలులో పెట్టడమే పనిగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టులోనే తేల్చుకుంటాం...
మంగళంపేటలో అటవీ భూములను ఆక్రమించుకున్నానంటూ ఈనాడు పత్రిక పనికట్టుకుని తప్పుడు వార్తలు రాస్తోందని పెద్దిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఆకాంక్షలకు అనుగుణంగా తనను టార్గెట్ చేసి అసత్య కథనాలను వండి వారుస్తోందన్నారు. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.
జనరంజకంగా వైఎస్ జగన్ పాలన
పేదలను గాలికి వదిలేసిన
కూటమి ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవంలో పెద్దిరెడ్డి, భూమన
పేదల కోసమే పుట్టింది
పేద ప్రజల అభ్యున్నతి కోసమే వైఎస్సార్‌సీపీ పుట్టిందని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నేతలు, కార్యకర్తలకు పంచిపెట్టారు. భూమన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగుపెడుతోందన్నారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం ప్రజాసంక్షేమం కోసం శ్రమిస్తున్నారని వెల్లడించారు. జగనన్న పాలనను ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని విమర్శించారు. కార్యక్రమంలో మేయర్ శిరీష, పార్టీ తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి, ఉదయ్‌వంశీ, దినేష్‌రాయల్, పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు గీతాయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షులు మాధవిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజలతోనే పదిహేనేళ్లు
Comments
Please login to add a commentAdd a comment