భూ సమస్యల పరిష్కారానికే రీసర్వే
శ్రీకాళహస్తి: రైతుల భూ సమస్యల పరిష్కార దిశగా రీసర్వే ప్రక్రియ చేపట్టామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఆయన తొట్టంబేడు మండలం బోనుపల్లిలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డి, స్థానిక రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రీసర్వేపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందని, అందులో ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు, శాసనసభ్యులు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎక్కువగా భూసమస్యలపైనే వచ్చాయని చెప్పారు. ఇదివరకు జరిగిన భూసర్వేలో జరిగిన తప్పుల వల్ల గందరగోళ పరిస్థితి ఏర్పడిందని, ఆ తప్పులను సరి చేసి పక్కాగా రీసర్వే చేస్తామన్నారు. రీసర్వే, రెవెన్యూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్వోలు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారో తెలుసుకోవడానికే గ్రామానికి వచ్చినట్లు తెలిపారు. ఈ గ్రామంలో రీసర్వే వల్ల జాయింట్ ఖాతాలు, వన్‌బీ సమస్యలు, భాగపరిష్కారం, సాదాబైనామీ అయి సాగులో ఉన్న వారికి పట్టాలు లేకపోవడం వంటి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. కాళంగి నది వల్ల పంట పొలాలు మునిగిపోవడం జరిగిందని రైతులు తెలుపగా.. రోజూవారీ ప్రణాళికతో క్షేత్రస్థాయిలో ఈ గ్రామ సమస్యలకు ఏవిధంగా పరిష్కారం చూపాలో ఆర్డీఓ, తహసీల్దార్‌ను ఆదేశించామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపరిహారం కూడా పొందలేకపోయారని, ధాన్య సేకరణకు అవకాశం ఉన్నా కూడా సంబంధిత వ్యవసాయ అధికారుల అవగాహనా లోపం వల్ల ఈ ప్రక్రియ జరగలేదని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు మధుసూదన్‌రావు, సర్వేయర్ హరినాథ్ , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బోనుపల్లి రీసర్వే ప్రక్రియలో దొర్లిన తప్పులను సరిదిద్దుతాం
క్షేత్ర స్థాయిలో పర్యటించిన కలెక్టర్ వెంకటేశ్వర్
Comments
Please login to add a commentAdd a comment