పారదర్శకంగా పది పరీక్షలు
● జిల్లాలో 164 పరీక్షా కేంద్రాలు ● హాజరుకానున్న 28,656 మంది విద్యార్థులు ● డీఈవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు ● ‘సాక్షి’తో డీఈవో కేవీఎన్ కుమార్
తిరుపతి అర్బన్: ‘పది పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశాం. ప్రధానంగా మాస్‌కాఫియింగ్‌కు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాం’అని జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా అన్ని వసతులు కల్పిస్తాం. జిల్లా వ్యాప్తంగా 164 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇందులో 28,656 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి 31 వరకు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 15,455 మంది, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 11,548 మంది, 634 మంది ప్రైవేటు విద్యార్థులు, 1,019 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 1,904 మందికి డ్యూటీలు ఇచ్చాం. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూతవేయాలి. డ్యూటీలో ఉన్న ప్రతి ఉద్యోగి ఐడీ కార్డులతోనే విధులకు హాజరుకావాలి. 1,476 మంది ఇన్విజిలేటర్లుతోపాటు రెవెన్యూ, పోలీస్, విద్యాశాఖకు చెందిన ముగ్గురు అధికారులతో కూడిన 6 ప్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. అంతేకాకుండా 30 సిట్టింగ్ స్క్వాడ్స్, 164 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 163 మంది డిపార్ట్‌మెంట్స్ ఆఫీసర్వు, 41 మంది కస్టోడియన్లు, 11 మంది రూట్ ఆఫీసర్లు, ఆరుగురు అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లు డ్యూటీల్లో ఉంటారు. జిల్లాలోని 39 పోలీస్ స్టేషన్లలో ప్రశ్నపత్రాలు ఉన్నాయి. వచ్చే శనివారం మరోసారి సిబ్బందితో సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వీకరించడానికి 7569787131 కంట్రోల్ రూమ్‌ను డీఈఓ కార్యాలంలో ఏర్పాటు చేశాం.’ అని చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment