బేస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది
సాక్షి, న్యూఢిల్లీ: తిరుపతి బస్టాండ్‌లో ఇంటర్–మోడల్ స్టేషన్(ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ టెర్మినల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) కు బేస్ మాస్టర్ ప్లాన్ సిద్దమైందని కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. బేస్ మాస్టర్ ప్లాన్ సిద్ధమైనందున ప్రాజెక్ట్ డిజైన్‌ను సంబంధిత వర్గాల సూచనలతో మెరుగుపరచే పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రయాణికుల రవాణా సౌకర్యం, భద్రత, వేగవంతమైన రాకపోకలకు అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నారని చెప్పారు. డిజైన్ సిద్దమైన వెంటనే పీపీపీ మోడల్ ద్వారా నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలసి ఈప్రాజెక్ట్ అమలు చేయనుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.
ఇంటర్ పరీక్షకు 901 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా 86 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు జనరల్‌లో 31,898 మంది, ఒకేషనల్‌లో 1,190మంది మొత్తం 33,088 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. అయితే వీరిలో 901మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ జీవీ.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల్లో భాగంగా శనివారం ద్వితీయ సంవత్సర విద్యార్థులకు కెమిస్ట్రి, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ సబ్జెక్టుల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్‌ఐఓ పేర్కొన్నారు
విద్యార్థులకు హాల్‌టిక్కెట్ ప్రామాణికం
తిరుపతి అర్బన్: పదో తరగతి విద్యార్థులకు హాల్‌టిక్కెట్ ప్రామాణికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు జిల్లా ప్రజారవాణా అధికారి నరసింహులు తెలిపారు. ఈనెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు విద్యార్థి స్వస్థలం నుంచి లేదా వారి పాఠశాల నుంచి పరీక్ష కేంద్రం వరకు వెళ్లిరావడానికి కండక్టర్‌కు హాల్‌టిక్కెట్ చూపిస్తే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్టినరీ సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవచ్చ, ఆ మేరకు జిల్లాలోని అన్ని డిపోల మేనేజర్లుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఇదిలావుండగా తమిళనాడులోని తిరువణ్ణామలైకు గురు, శుక్రవారాలు పౌర్ణమి సందర్భంగా 142 సర్వీసులను జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment