
వివాహ వేడుకకు వెళ్తూ..
పెళ్లకూరు: నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి, పెన్నేపల్లి గ్రామ సమీపాన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రదీప్(26) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్‌ఐ నాగరాజు కథనం.. కర్ణాటక రాష్ట్రం, ఓసూరు ప్రాంతానికి చెందిన ప్రదీప్ విజయవాడలో జరగనున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు మోటారు బైక్‌లో వెళుతున్నాడు. మార్గ మధ్యంలో పెన్నేపల్లి గ్రామ సమీపాన రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. ప్రదీప్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
సైబర్ నేరగాళ్ల వలలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.5.39 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. పేరూరు గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉన్న ఉద్యోగం కంటే బెటర్ జాబ్ చూసుకుని కొత్త కంపెనీకి మారాలనే ఉద్దేశంతో ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండగా, 2024 డిసెంబర్ 29న టెలిగ్రామ్ ద్వారా ఓ సందేశం అతని ఫోన్ నెంబర్‌కు అందింది. పార్ట్ టైం జాబ్ పేరుతో ఉన్న ఆ మెసేజ్‌లో ఉన్న లింక్ ఓపెన్ చేయగా, హోటళ్లకు స్టార్ రేటింగ్ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించొచ్చు అని పేర్కొన్నారు. బాధితుడు సూచించిన విధంగా పని చేయగా, మొదట రూ.700 అతని ఖాతాలో జమైంది. స్థిరమైన ఉద్యోగం కావాలంటే ముందుగా డబ్బు జమ చేయాలని చెప్పి మోసగాళ్లు చెప్పిన 12 బ్యాంక్ ఖాతాల్లో రూ.5.39 లక్షలను సదరు ఉద్యోగి జమ చేశాడు. అయినా సరే వంద పాయింట్లు పూర్తి కాలేదని, మరింత డబ్బు జమ చేయాలని నేరగాళ్లు ఒత్తిడి చేయడంతో మోసపోయినట్లు బాధితుడు గ్రహించాడు. వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేశారు. తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment