
వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
గుడిమల్లం ఆలయాన్ని దర్శించిన సుప్రీంకోర్టు జడ్జి
ఏర్పేడు(రేణిగుంట): భారత సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సరస వెంకటనారాయణ భట్టి శుక్రవారం ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ మాజీ చైర్మన్ బత్తల గిరినాయుడు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, వేదపండితుల ఆశీర్వచనాలను అందించి ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు వంశీకృష్ణశర్మ, అర్చకులు యోగేంద్రపవన్‌కుమార్‌శర్మ, సంతోష్ పాల్గొన్నారు. అలాగే కృష్ణా నది బోర్డు మెంబర్ దివాకర్ రాయపురి గుడిమల్లం పరశురామేశ్వరుని దర్శించకున్నారు.
బీఈడీ, ఎంబీఏఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీలో జనవరిలో జరిగిన ఏంబీఏ మీడియా మేనేజ్‌మెంట్ తొలి సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ మొదటి సెమిస్టర్ ఫలితాలను సైతం విడుదల చేసినట్లు తెలియజేశారు. ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
ఎర్రచందనం వేలం, విక్రయాలపై చర్చ
తిరుపతి మంగళం : తిరుపతి నగరంలోని మారస సరోవర్ హోటల్లో నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిపుణుల కమిటీ (ఎక్స్ పర్ట్ కమిటీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అటవీ, బయోడైవర్సిటీ అథారిటీ, ఏపీ బయోడైవర్శిటీ బోర్డు, జీవవైవిధ్య కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎర్ర చందనం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం, కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేయాల్సిన 5 శాతం నిధులు, అంతేకాకుండా అటవీ ఉత్పత్తులను ట్రేడింగ్ చేసే వ్యాపారుల నుంచి 2, 3 శాతం నిధుల వసూలుపై చర్చించినట్లు సమాచారం. ఎర్రచందనం వేలం, రైతులు సాగు చేస్తున్న ఎర్రచందనం అమ్మకాల విధి విధానాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ నిపుణుల కమిటీ సమావేశం శనివారం కూడా జరగనుంది.
డీఎస్సీ ఉచిత శిక్షణ
దరఖాస్తులకు తుది గడువు నేడు
తిరుపతి అర్బన్ : డీఎస్సీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కోచింగ్ సదుపాయం పొందడానికి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి శనివారం వరకు గడువు ఉందని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి విక్రమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో దరఖాస్తు చేసుకున్న వాటిని పరిగణలోకి తీసుకుంటున్నామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన అభ్యర్థులు ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బీసీలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి వీలుందని బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి జోత్స్న తెలిపారు. 10వ తేదీ నుంచి కలెక్టరేట్‌లోని బీ బ్లాక్ మూడో అంతస్తులోని తమ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ

వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
Comments
Please login to add a commentAdd a comment