కేంద్ర నిధులు గడువులోపు ఖర్చు చేయండి
తిరుపతి అర్బన్: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను గడువులోపు ఖర్చు చేయాలని మినిస్ట్రీ అఫ్ ట్రైబల్ అఫైర్స్ కార్యదర్శి విభునాయర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం ఆయన కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌తోపాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ జాతీ య ఉన్నత్ గ్రామ అభియాన్ పథకంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన మూడు ఎస్టీకాలనీల్లో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని మేలచ్చూరు ఎస్టీకాలనీ, డక్కిలి మండలంలోని కందులవారిపల్లి, వడమాలపేట మండలంలోని కదిరికుప్పంలో సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాంటివి మ రిన్ని ఎస్టీకాలనీలున్నాయని, వాటిని కూడా అభివృద్ధి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా విభునాయర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన 500 మంది ఎస్టీలున్న కాలనీలను ఎంపిక చేయాలని చెప్పారు. లేదంటే 50 శాతానికి మించి ఎస్టీలున్న గ్రామాలు ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్ పథకంలోకి వస్తాయన్నారు. అలాంటి గ్రామాలు జిల్లాలో మరో 25 ఉన్నాయని కలెక్టర్ చెప్పారు. ఆ 25 గిరిజన గ్రామాల వివరాలను పంపాలని విభునాయర్ చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ సదా భార్గవి, ట్రైబల్ వెల్ఫేర్ కార్యదర్శి మల్లికార్జున నాయక్, అడిషనల్ డైరెక్టర్లు సరస్వతి, మల్లికార్జున్‌రెడ్డి, జాయింట్ డైరెక్టర్ ప్రతిభాభారతి, డీడీ చంద్రిక, నెల్లూరు జిల్లా ఈడీ శ్రీనివాసరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment