
తూతూమంత్రంగా ‘గ్రీవెన్స్’
తిరుపతి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో అధికారులు పెద్దసంఖ్యలో జనం నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అయితే వాటి పరిష్కారంలో మాత్రం శీతకన్ను వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వారాలు మినహా ఇప్పటి వరకు మొత్తం 34 వారాలు గ్రీవెన్స్ నిర్వహించారు. అందులో దాదాపు 8వేలకు పైగా అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూ సమస్యలపైనే 6వేల వరకు వినతులు ఉన్నాయి. మిగిలిన 2వేల అర్జీల్లో ఇప్పటి వరకు 50శాతం కూడా పరిష్కరించకపోవడం గమనార్హం. సచివాయాల్లో సిబ్బంది సర్వేల్లో తలమునకలు కావడం, మండ కార్యాలయాల అధికారులు గ్రీవెన్స్‌ను పట్టించుకోకపోవడంతో చిన్నాచితక సమస్యలపై కూడా ప్రజలు కలెక్టరేట్‌కు రావాల్సి వస్తోంది. వీధిలైట్లు, దారి, తాగునీటి సమస్యలకు కూడా కలెక్టరేట్‌లో అర్జీ పెట్టుకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు.
ఒక్కోసారి.. ఒక్కోలా..
కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో అధికారులు ఒక్కోవారం ఒక్కో విధంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒక వారం క్యూ విధానం పాటిస్తారు. మరోసారి అర్జీదారులను గుంపులు గుంపులుగా వదిలేస్తున్నారు. ఈ క్రమంలోనే వినతులు రాసేందుకు సైతం ఏర్పాట్లు చేయడంలేదు. ప్రజలు కుర్చునేందుకు సైతం అవకాశం కల్పించడం లేదు. ఈ క్రమంలోనే మరుగుదొడ్ల పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారు. దీంతో కలెక్టరేట్‌లోని పలు విభాగాల వద్ద దుర్వాసనే ప్రజలకు స్వాగతం పలుకుతోంది.
వినతులు సరే.. పరిష్కారమేదీ?
పట్టించుకోని అధికారులు
అందరూ రారు..!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. కలెక్టరేట్‌లోని మొత్తం 80 విభాగాలకు చెందిన జిల్లా అధికారులు హజరయ్యేలా చర్యలు చేపట్టేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. 50 విభాగాల అధికారులు హాజరైతే గొప్పగా మారిపోయింది. మిగిలిన విభాగాల వారు తమ సిబ్బందిని పంపించి చేతులుదులిపేసుకుంటున్నారు. గ్రీవెన్స్‌లో కలెక్టరే ఉంటే ఓ విధంగా, జేసీ ఉంటే ఇంకోలా.. డీఆర్‌ఓ హాజరైతే మరోలా అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment