
మహిళపై కర్రలతో దాడి
● కేసు నమోదు చేయని పోలీసులు ● ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
చిన్నగొట్టిగల్లు (ఎర్రావారిపాళెం): పాత కక్షలతో ఓ మహిళను నడిరోడ్డుపై పట్టపగలు ఈడ్చుకుని వెళ్లి కర్రలతో కొట్టినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయని ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన జీవిత అనే మహిళ తలకోనకు వెళ్లే మార్గంలో హోటల్ నడుపుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ఈశ్వరయ్య, అతడి కుమారుడు హరికి ఆమెతో భూవివాదముంది. ఈ క్రమంలో ఈనెల 14వ తేదీన జీవిత తన హోటల్ వద్ద ఉండగా ఈశ్వరయ్య, హరి అటువైపుగా వచ్చి తమ గొర్రెలను వదిలేశారు. హోటల్ వద్ద ఉన్న ఓ వ్యక్తి వాటిని తరిమేందుకు యత్నించగా ఆగ్రహించారు. జీవితపై దాడికి దిగారు. బాధితురాలు వెంటనే పోలీస్‌స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. ముందు ఆస్పత్రికి వెళ్లాలని పంపేశారు. ఆదివారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లినా స్పందించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి నేతల ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదుకు వెనుకాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నారు. దీనిపై ఎస్‌ఐ ఎర్రిస్వామిని వివరణ కోరగా దాడిచేసిన వారు బాధితురాలికి సమీప బంధువులని, ఈ మేరకు తాము మాట్లాడతామని గ్రామపెద్దలు కోరడంతో కేసు నమోదుకు సమయం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందులో వేరే ఉద్దేశం లేదని తెలిపారు.
కారు బోల్తా : వృద్ధురాలి మృతి
చిల్లకూరు : చైన్నె– కోల్‌కత్తా జాతీయ రహదారిపై రైటార్‌సత్రం వద్ద ఆదివారం వేకువజామున ఓ కారు బోల్తా పడడంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన జాలా పెంచలమ్మ(76) శ్రీకాళహస్తిలో ఉన్న తన కుమార్తె సునీత దగ్గరకు రెండు రోజుల క్రితం వెళ్లింది. కారులో కుమార్తె సునీత, మనుమరాళ్లు లహరి, పెన్నిధితో తిరుగు ప్రయాణం కాగా మార్గం మధ్యలో అదుపు తప్పి కల్వర్టు ఢీకొని బోల్తా పడింది. దీంతో పెంచలమ్మ అక్కడిక్కడే మరణించింది. మిగిలినవారు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment