
పచ్చమూక ఆక్రమణలో అటవీ భూములు
● వెంకటగిరి పరిధిలో కబ్జాల పర్వం ● 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో వందల ఎకరాలు అన్యాక్రాంతం ● గత వైఎస్సార్‌సీపీ సర్కారు హయాంలో 100 ఎకరాల స్వాధీనం ● మిగిలిన భూములను దర్జాగా సాగు చేసుకుంటున్న టీడీపీ నేతలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : వెంకటగిరి రూరల్ మండలంలోని విలువైన అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి. అక్కడక్కడా మిగిలిన భూములను సైతం గత కొంత కాలంగా దర్జాగా కబ్జా చేస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు. చేసేది లేక కొందరు అధికారులు సైతం టీడీపీ నాయకులతో కుమ్ముకై ్కపోతున్నారు. ఆక్రమిత భూముల్లో కొన్నింటిని ఆన్‌లైన్‌లో రెవెన్యూ భూములుగా మార్చుకుంటున్నారు.
అధికారమే అండగా..
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. అలా ఆక్రమించుకున్న వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వెంకటగిరి రూరల్ మండలం మన్నేగుంట, పూలరంగడుపల్లి, బసవాయిగుంట పరిధిలో సుమారు 1200 ఎకరాల అటవీ, మరో 65 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి. 2014–19 మధ్య కాలంలో ఈ భూములను టీడీపీ నేతలు కొందరు ఒక్కొక్కరు 20 నుంచి 100 ఎకరాల వరకు ఆక్రమించుకున్నారు. అందులో అటవీ యాక్ట్‌ని తుంగలో తొక్కి ఉన్న చెట్లను జేసీబీలతో తొలగించి చదునుచేసి పంటల సాగు ప్రారంభించారు. అటవీ భూముల్లో విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరు. అయినా కొందరు విద్యుత్ కనెక్షన్లు తీసుకుని బోర్లు వేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. మరి కొందరు బోర్లు వేసుకుని సోలార్ విద్యుత్ ద్వారా పంటలు పండించుకుంటున్నారు. ఈ ఆక్రమణలను అప్పట్లోనే సాక్షి వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నంబర్ 74లోని 175 ఎకరాల్లో సుమారు వంద ఎకరాల వరకు అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భూముల్లో జోలికి వెళ్లలేదు. అప్పట్లో టీడీపీ నేతలు అడ్డుకున్నారని నాటి అటవీ అధికారులు చెప్పుకొచ్చారు.
మరోసారి రెచ్చిపోతున్న కబ్జాదారులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమార్కులు రంగంలోకి దిగారు. మిగిలి ఉన్న అటవీ భూములను ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నారు. జేసీబీలు, ట్రాక్టర్లతో చదునుచేసి సాగు చేసుకునేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఆక్రమణలకు కొందరు అటవీ, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నోటీసులు ఇస్తున్నాం
వెంకటగిరి రేంజ్ పరిధిలో భారీగా అటవీ భూములు ఉన్న మాట వాస్తవమే. వాటిని కొందరు ఆక్రమించుకున్నదీ నిజమే. కబ్జాకు గురైన భూముల్లో సుమారు వంద ఎకరాల వరకు స్వాధీనం చేసుకుని ప్లాంటేషన్ చేశాం. మిగిలిన భూమిని స్వాదీనం చేసుకోవాల్సి ఉంది. ఆక్రమణ దారులకు నోటీసులు ఇస్తున్నాం. అటవీ భూముల ఆక్రమణ చట్టరీత్యానేరం. ఎప్పటికై నా స్వాధీనం చేసుకుంటాం.
– లోకేష్, ఫారెస్ట్ రేంజర్, వెంకటగిరి

పచ్చమూక ఆక్రమణలో అటవీ భూములు
Comments
Please login to add a commentAdd a comment