
అర్జీలు..నిరసనల హోరు
తిరుపతి అర్బన్: సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు కలెక్టరేట్‌కు పోటెత్తారు. సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి మొత్తం 250 అర్జీలు వచ్చినట్టు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. అందులో 165 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఆరోగ్య మిత్రల నిరసన
కలెక్టరేట్ వద్ద ఆరోగ్య మిత్రలు నిరసన వ్యక్తం చేశారు. 17 ఏళ్లుగా పనిచేస్తున్నా క్యాడర్ అమలు చేయలేదన్నారు. ఎంటీఎస్ లేక.. ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తింపు లేక ఇక్కట్లు పడుతున్నట్టు వెల్లడించారు. మరోవైపు సీసీ కెమెరాల కింద కుర్చూని పనిచేయడం మహిళలకు ఇబ్బందిగా ఉందని ఆవేదన చెందారు. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
పెన్షనర్ల సమస్యలను పట్టించుకోండి
‘మూడు దశాబద్దాలకు పైగానే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేశాం.. కానీ రావాల్సిన బెనిఫిట్స్‌ను తీసుకోకుండానే పలువురు మృతి చెందుతున్నారు’ అంటూ పలువురు పెన్షనర్లు వాపోయారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీకి సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.
డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి
ఎస్సీ, ఎస్టీలకు చెందిన విద్యార్థులకు డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, ఐసీ, జీఎన్‌ఎస్, నల్సా విభాగాలకు చెందిన విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
Comments
Please login to add a commentAdd a comment