
వెదురు పెంపకంపై అవగాహన
తిరుపతి అర్బన్: వెదురు పంట సాగుకు రాయితీలున్నాయని జిల్లా ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డి తెలిపారు. తిరుపతిలోని అటవీశాఖ బయోట్రిమ్ కార్యాలయంలో రైతులకు వెదురు సాగుపై అవగాహన కల్పించారు. తిరుపతితోపాటు చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలకు చెందిన రైతులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా ఒక హెక్టార్లు సాగుకు రూ.50 వేల రాయితీ ఉందని చెప్పారు. అలాగే నర్సరీ సాగుచేస్తే హెక్టార్‌కు రూ.20 లక్షలు గరిష్టంగా అందిస్తారని వివరించారు. ఉదయగి అగ్రికల్చర్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి వెదురుపై రైతులకు అంశాల వారీగా వివరించారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన ఒరవడి
– తిరుపతి ఐఐటీ ఇన్నోవేషన్ హబ్‌ను సందర్శించిన డీఎస్‌టీ సెక్రటరీ
ఏర్పేడు(రేణిగుంట): ఆపరేషన్ ద్రోణగిరితో భౌగోళిక స్థాన సంబంధిత విధానం అమలుతో దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలలో నూతన ఒరవడి చోటుచేసుకోనుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అభయ్ కరండేకర్ అన్నారు. ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీ ప్రాంగణంలోని టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌లో జరుగుతున్న డెమోడే షోకస్ ఈవెంట్‌లో ఆయన సోమవారం పాల్గొన్నారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్‌ఎం– ఐసీపీఎస్ మిషన్ డైరెక్టర్ ఏక్తా కపూర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ ధనలక్ష్మి, జీడీపీడీసీ చైర్మన్ శ్రీకాంత్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల పురోభివృద్ధికి అలవంభించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ రోషన్ శ్రీవాస్తవ్ కొత్త ప్రాజెక్టుల గురించి వివరించారు. జియోస్పేషియల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావటానికి 25 అగ్ర స్టార్టప్‌లను గుర్తించినట్లు వెల్లడించారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
పెళ్లకూరు: మండలంలోని ముమ్మారెడ్డిగుంట గ్రామానికి చెందిన చింతపూడి హరీష్(18) సోమవారం అక్కగారిపేట గ్రామ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్‌ఐ నాగరాజు కథనం మేరకు.. చిన్నతనంలోనే హరీష్ తల్లిదండ్రులను కోల్పోయాడు. ముమ్మారెడ్డిగుంట గ్రామంలోని మేనమామ ఆనంద్ వద్ద ఉంటున్నాడు. అయితే గత కొంత కాలంగా మద్యానికి బానిసై అక్కగారిపేట గ్రామ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ చేరుకుని 108 సహాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. హరీష్ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో ఉంది.

వెదురు పెంపకంపై అవగాహన

వెదురు పెంపకంపై అవగాహన
Comments
Please login to add a commentAdd a comment