
పునుగు పిల్లుల నివాస స్థావరాల అభివృద్ధి
తిరుమల : తిరుమల శ్రీవారి అభిషేకంలో ఉపయోగించే పునుగు తైలం కోసం తిరుపతి శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో పెంచుతున్న పునుగు పిల్లుల నివాస స్థావరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జూపార్కులో ఇప్పటికే నిర్మించిన నిశాచర జీవుల నివాస స్థావరం (నాక్టనల్ హౌస్)లో పునుగు పిల్లుల సంరక్షణకు ప్రత్యేకంగా నిర్మించిన గదులు ఇంటీరియర్ అభివృద్ధి కోసం జూ అధికారుల ప్రతిపాదనలను అనుమతిస్తూ 2024 డిసెంబర్ 24 తేదీన బోర్డు సమావేశంలో టీటీడీ అంగీకారం తెలిపింది. రూ.1,97,31,200లతో రూపొందించిన సదరు ప్రతిపాదనలను టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. టీటీడీ ప్రతిపాదనలకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఉరి వేసుకొని
యువకుడి మృతి
సత్యవేడు: శ్రీసిటీ పరిధిలోని చిగురుపాళెం చెరువు కట్టపై రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని తనువుచాలించాడు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. రాజస్థాన్‌కు చెందిన సిబ్ ముంజి(45) శ్రీసిటీలోని హెమల్టన్ కంపెనీలో కార్మికుడిగా ఉంటూ చిగురుపాళెం గ్రామ పరిసరాల్లో నివసిస్తున్నాడు. తనకున్న అనారోగ్య సమస్య, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మద్యం తాగి గ్రామ సమీపంలోని చెరువుపై ఉన్న వేప చెట్టుకు తాడుతో ఉరివేసుకొని మృతిచెందినట్టు ఎస్‌ఐ హరిప్రసాద్, సీఐ శ్రీనివాసులు తెలిపారు. సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
రాయలవారి కోట సందర్శన
చంద్రగిరి: చంద్రగిరి కోటను న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కళాశాలకు చెందిన బృందం సోమవారం సందర్శించింది. స్టడీ టూర్లో భాగంగా చంద్రగిరి కోటను సందర్శించారు. ఏపీ మానవ వనరుల శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు నేతృత్వంలో నేషనల్ డిఫెన్స్ మేజర్ జనరల్ సీపీ సంఘ్రా, సివిల్ సర్వీసెస్ అధికారి బాలాజీ ఆధ్వర్యంలో ఇండియన్ నేవి, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, సివిల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ అధికారులు భారతదేశానికి చెందిన 12 మంది, రష్యా, శ్రీలంక, ఇండోనేషియా, సౌతాఫ్రికా, నేపాల్ దేశాలకు చెందిన ఐదుగురు కోటను సందర్శించారు. ఏపీ టూరిజం రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, కోట ఆర్కియాలజీ కన్జర్వేటర్ బాలకృష్ణారెడ్డి, చంద్రగిరి తహసీల్దార్ శివరామసుబ్బయ్య, ఎంపీడీఓ వెంకటరత్నం, బృందం కో–ఆర్డినేటర్ కార్తీక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment