ఆత్యధునిక హంగులతో రూపుదిద్దుకున్న పెంకుటిల్లు
సాక్షి,సిద్దిపేట: కోట్లు వెచ్చించిన నిర్మించిన ఇల్లును కూడా చిన్న చిన్న కారణాలతో కూల్చివేస్తున్న ఈ రోజుల్లో వారసత్వంగ వచ్చిన మట్టిగోడల పెంకుటిల్లుపై మమకారం పెంచుకున్నాడు. ఆస్తుల పంపకాల్లో తన వాటాకు తాత, తండ్రుల నుంచి వచ్చిన ఇల్లు రావడంతో కూల్చడానికి మనసు రాలేదు. లక్షలు వెచ్చించి అత్యాధునిక హంగులతో నచ్చిన విధంగా మార్చుకున్నాడు. సిద్దిపేట జిల్లా రూరల్ మండలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన కోటగిరి యాదగిరిగౌడ్ అందంగా తీర్చిదిద్దిన ఆ అందమైన పొదరిల్లును చూడడానికి సందర్శకులు నిత్యం వస్తూ వావ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనం మండువా ఇళ్లు. అటువంటి ఇల్లు కలిగిన యజమానికి సంఘంలోనూ గౌరవం ఉండేది. రానురాను ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడంతో మండువాలోగిళ్ల అవసరం లేపోయింది, తెలంగాణంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ రకమైన ఇళ్లు మనకు కనిపిస్తుంటాయి. ఈ ఇంటి ప్రత్యేకత గాలి, వెలుతురు చాలినంతగా ప్రసరించేలా నిర్మాణం ఉంటుంది. విశాలమైన గదులు అబ్బురపరుస్తాయి. పచ్చని పంటచేలు, కాల్వలతో కళకళలాడే పల్లెలకు ఈ మండువాలోగిళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఆ తర్వాత పట్టణాలకు దీటుగా గ్రామాల్లోనూ కాంక్రీటు భవనాల నిర్మాణం పెరిగింది.
చదవండి: ఓటు హక్కు లేదా.. ఇలా నమోదు చేసుకోండి..
70 ఏళ్ల క్రితం నాటిది..
తల్లిదండ్రులు చేసిన ఆస్తుల పంపకాల్లో పెద్ద కుమారుడైన యాదగిరికి తన వాట కింద వారసత్వంగా వచ్చిన పెంకుటిల్లు వచ్చింది. ఆ ఇల్లు అంటే యాదగిరికి చాలా ఇష్టం. అది శిథిలావస్థలో ఉన్నా.. కూల్చడానికి మనసు రాలేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదని రూ. 30 లక్షల వెచ్చించి తనకు కావాల్సిన విధంగా తీర్చిదిద్దాడు. ముందుగా ఆ మట్టి గోడలను పూర్తిగా చెక్కి ప్లాస్టింగ్ చేయించాడు. అనంతరం పుట్టి పెట్టించి రంగులు వేయించాడు.
మరమ్మత్తులు చేస్తున్న కూలీలు
పై కప్పు తొలగించి బెంగుళూర్ పెంకులు వేసి, టేకు కర్రతో అందమైన డిజైన్స్ చేయించాడు. దీనికి తోడు ఇంటి ముందు చూడడానికి అందమైన కళాకృతుల డిజైన్లు, ఆకృతులతో కూడిన తలపులు బిగించారు. లోపల అన్ని రకాల ఆధునిక సౌకర్యాలు ఉండేలా మరమ్మత్తులు చేయించారు. అది పెంకుటిల్లే అయినా భవనంలో ఉండే అన్ని వసతులున్నాయి. మొదట ఈ మరమ్మత్తులు చూసి చాలా మంది నవ్వినా పూర్తయిన తర్వాత బాగుందని కితాబిచ్చారు. 70 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ ఇల్లు పెద్దపెద్ద దూలాలతో నాలుగు గదులను నిర్మించారు. ప్రస్తుతం అది పెంకుటిల్లా లేక భవంతా అనే విధంగా చూపరులను ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment