వికారాబాద్: అధికార పార్టీ అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. పార్టీకి దూరమవుతున్న నేతలను అక్కున చేర్చుకునేందుకు చేసిన ప్రయత్నాలు అంతం మాత్రమే అని చెప్పవచ్చు. బీఆర్‌ఎస్ చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమితులైన ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెట్టారు. అయి తే వికారాబాద్‌లో అసమ్మతి నేతలు ఎక్కువగా ఉండడంతో ముందుగా ఇక్కడే ఎక్కువ దృష్టి సారించారు. ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేశారు.
దీంతో ఆయన్ను వికారాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేసి పరిస్థితిని చక్కబెట్టాలని అధిష్టానం సూచించింది. అప్పటి నుంచి ఎంపీ అసమ్మతి నేతలను దారిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అభ్యర్థి ఆనంద్ గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న ఆయన వలసలు ఆపేందుకు విశ్వప్రయత్నం చేశారు. కానీ సఫలం కాలేదు. అసమ్మతి నేతల్లో ఒకరిద్దరిని మాత్రమే ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా చేయగలిగారు.
పార్టీ వీడిన మెజార్టీ నేతలు
బీఆర్‌ఎస్ వికారాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిని సద్దుమణిగేలా చేయడంలో ఎంపీ మొదలుకొని అధిష్టాన ముఖ్య నేతల చేసిన ప్రయత్నాలు చాలా వరకు విఫలమయ్యాయి. ఎంపీ రంజిత్‌రెడ్డి ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టింది మొదలు వికారాబాద్‌లోనే మకాం వేసి నేతలను బుజ్జగించే పనులు మొదలు పెట్టారు. వారిని అధిష్టానం వద్దకు తీసుకెళ్లి సంప్రదింపులు జరిపారు. అయితే తమకు పార్టీ అంటే గౌరవమని, స్థానిక ఎమ్మెల్యే వల్లే సమస్యలని తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ పెద్దల సూచనలతో బీఆర్‌ఎస్‌లోనే ఉంటూ అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తున్నారు.
అయినా ఎమ్మెల్యేతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎంపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా సగం మంది అసమ్మతి నేతలు ఇప్పటికే బీఆర్‌ఎస్ వీడి హస్తం పార్టీలో చేరారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల రమేశ్ దంపతులు, ధారూరు ఎంపీపీ నరోత్తంరెడ్డి, కౌన్సిలర్ చందర్‌నాయక్, పట్లూర్ ఎంపీటీసీ సురేశ్, మరో సీనియర్ నాయకుడు రామేశ్వర్, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
వ్యూహాలకు పదును
బీఆర్‌ఎస్ నుంచి వలసలు ఆపేందుకు ఎంపీ రంజిత్‌రెడ్డి చేసిన ప్రయత్రాలు వృథా కావడంతో ఆ పార్టీ నేతలు వ్యూహాలు మార్చారు. సొంత పార్టీ నేతలను ఆపడం మాని ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బీఎస్పీ, కాంగ్రెస్, తదితర పార్టీల నుంచి పలువురు నేతలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇదే క్రమంలో ఆయన మండలాల వారీగా పీఆర్‌ఓలను నియమించుకొని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment