
ఆర్టీసీ డ్రైవర్‌పై దురుసు ప్రవర్తన
ధారూరు: ఆర్టీసీ బస్సు వెనుకాలే వస్తున్న కారు ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సును తగులుకుంటూ ముందుకెళ్లింది. కారు గీతలు పడడంతో సదరు యజమాని బస్ డ్రైవర్ ఫోన్ తీసుకెళ్లి స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం వెలుగుజూసింది. వివరాలు.. బుధవారం వికారాబాద్ నుంచి తాండూరు వైపు ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తోంది. మోమిన్‌పేట్ సీఐ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది బలరాం కారు బస్సు వెనుకాలే వస్తోంది. అనంతగిరి సమీపంలోని జింక బొమ్మ రోడ్డు మలుపులో స్పీడ్ బ్రేకర్ వద్ద బస్సు స్లోగా వెళ్తుండడంతో కారు బస్సు వెనుక నుంచి రాసుకుంటూ కొంత దూరం వెళ్లగా గీతలు పడ్డాయి. వెంటనే బలరాం బస్సును ఆపి డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించి సెల్‌ఫోన్ లాక్కున్నాడు. డ్రైవర్‌ది తప్పు కానప్పటికీ బ్రతిమాలి డబ్బు ఇస్తానని చెప్పినా వినకుండా ఫోన్ ఇవ్వకుండా వెళ్లాడని ఆరోపించాడు. దీంతో డ్రైవర్ ధారూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ పరిధిలోరి రాదని, వికారాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ అనిత సూచించారు.
24 గంటలపాటు స్విచ్ఛాఫ్
బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో నా ఫోన్ జీపీఆర్‌ఎస్‌కు అనుసంధానంగా ఉంటుంది. హెడ్ కానిస్టేబుల్‌దే తప్పని అందరు చెప్పిన నా ఫోన్ తీసుకుని పోయి 24 గంటల పాటు స్విచాఫ్ చేసుకున్నారు. చివరకు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మోమిన్‌పేట సీఐ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బలరాం ఫోన్ ఇవ్వాలని కోరితే రూ. 15వేలు డిమాండ్ చేస్తున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఐ భీంకుమార్‌ను కోరారు. కాగా సీఐని వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేరు.
జీపీఆర్‌ఎస్‌కు అనుంసంధానమైన ఫోన్ లాక్కెళ్లిన హెడ్ కానిస్టేబుల్
బలరాంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన డ్రైవర్ షఫీ