
మట్టి.. కొల్లగొట్టి!
మొయినాబాద్: అక్రమార్కులకు మట్టే బంగారమవుతోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో నుంచి తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రి సమయంలో మట్టిని తీసుకెళ్లి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఫాంహౌస్‌లకు విక్రయిస్తున్నారు. ఇలా నిత్యం వందలాది టిప్పర్ల మట్టి తరలిపోతోంది. నగరానికి కూత వేటు దూరంలో ఉన్న మొయినాబాద్‌లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. టిప్పర్ల యజమానులు నిత్యం ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల్లో మట్టి తవ్వి విక్రయిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారం పెద్ద చెరువులో నుంచి కొద్ది రోజులుగా నల్లమట్టిని తరలించుకుపోతున్నారు. రాత్రి వేళటిప్పర్ల ద్వారా తీసుకెళ్లి ఒకచోట డంప్ చేసుకుంటున్నారు. ఆతర్వాత ఫాంహౌస్‌లకు అమ్ముతున్నారు. మండలంలోని నాగిరెడ్డిగూడ సమీపంలో ఉన్న హిమాయత్‌సాగర్ చెరువులో నుంచి సైతం నల్లమట్టిని తరలిస్తున్నారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూముల నుంచి ఎర్రమట్టి, మొరం తవ్వుతున్నారు. పెద్దమంగళారం, అప్పోజీగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో ఎర్రమట్టి, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, నక్కపల్లి, తోలుకట్ట ప్రాంతాల నుంచి మొరం తరలిస్తున్నారు. ఇలా నిత్యం వేలాది రూపాయల దందా నిర్వహిస్తున్నారు.
సెలువు రోజుల్లోనే అధికంగా..
సెలవు రోజులను ఎంచుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అధికారులు ఎవురూ అందుబాటులో ఉండరనే వ్యూహంతో హాలీ డేస్‌ను ఇలా వినియోగించుకుంటున్నారు. చెరువులు, కుంటలను కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్నారు. ఆతర్వాత నిఘా పెట్టడంలేదనే విమర్శలు వస్తున్నాయి. రెవెన్యూ శా ఖలో గ్రామస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలు అధికారులకు తెలియడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే ఇవి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికై నా అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కేసులు నమోదు చేశాం
పెద్దమంగళారం పెద్ద చెరువులో నల్ల మట్టి తవ్వుతున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తీస్తున్నవారిపై అప్పట్లోనే కేసులు నమోదు చేశాం. మళ్లీ ఎవరైనా మట్టి తీస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. మండలంలోని అన్ని చెరువులపై ప్రత్యేక నిఘా పెడతాం.
– ప్రియాంక, ఇరిగేషన్ ఏఈ, మొయినాబాద్
యథేచ్ఛగా అక్రమ దందా!
చెరువులు, కుంటల నుంచి మట్టి తరలిస్తున్న అక్రమార్కులు
ప్రభుత్వ భూములే లక్ష్యంగా తవ్వకాలు
రాత్రి వేళ, సెలవుదినాల్లో టిప్పర్ల ద్వారా తరలింపు
ఫాంహౌస్‌లలో పోసి సొమ్ముచేసుకుంటున్న వైనం

మట్టి.. కొల్లగొట్టి!