
అప్రమత్తతే రక్ష
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు అవసరం
వికారాబాద్: ‘ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. లేకుంటే వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది.. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం’.. అని డీఎంఅండ్ హెచ్‌ఓ వెంకటరవణ అన్నారు. ఎండల నుంచి ఎలా ఉపశమనం పొందాలి.. వడదెబ్బ బారిన పడుకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. శాఖా పరంగా తీసుకుంటున్న చర్యలను శనివారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన మాటల్లోనే..
అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దు
పదిహేను రోజులుగా ఎండలతోపాటు వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సూచనలతో శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వడదెబ్బకు గురయ్యే సమయంలో చేయాల్సిన ప్రథమ చికిత్స, చేయకూడని పనులపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో 720 మంది ఆశా వర్కర్లు పనిచేస్తుండగా ప్రతి ఒక్కరి వద్ద వంద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 200ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. ఉపాఽధి హామీ పనులు జరిగే ప్రదేశంలో కూడా వీటిని అందుబాటులో ఉంచాం. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు. వృద్ధులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఉదయం 11నుంచి సాయంత్రం 5గంటల వరకు బయటకు రాకపోవడం మంచింది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఇందులో భాగంగా ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు, పట్టణ, పల్లె, బస్తీ దవాఖానాల్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఒకవేళ ప్రజలు వడదెబ్బ బారిన పడితే ఎలాంటి వైద్యం చేయాలి.. ఏ ఆస్పత్రికి తరలించాలి.. అనే విషయాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం.
వేసవిలో చేయకూడని పనులు
● సాధ్యమైనంత వరకు మండుటెండలో తిరగరాదు. అత్యవసరం ఉంటే తగు జాగ్రత్తలతో బయటకు వెళ్లాలి.
● ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. మద్యం సేవించడం వల్ల డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.
● రోడ్ల పక్క విక్రయించే రంగుల శీతల పానీయాలను తాగకపోవడం మంచిది. కలుషిత ఆహారం కూడా తీసుకోరాదు.
● మాంసాహారం తగ్గించడం మంచిది.. రోజువారి ఆహారంలో పళ్లు, కూరగాయలు, నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఇవి చేస్తే మేలు
● నీటితోపాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
● ఆహారం మితంగా తీసుకోవాలి.
● రోజుకు కనీసం 12నుంచి 15 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయడం ద్వారా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండదు.
● వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు రోజుకు రెండు పూటలా స్నానం చేయాలి. కాటన్, పలచటి దుస్తులు, లేతవర్ణం దుస్తులు ధరించాలి.
● దోమతెరలు కచ్చితంగా వాడాలి..
● సాధ్యమైనంత వరకు ఇళ్లలో ఉండాలి. బయటకు వస్తే గొడుగు, టోపీ లాంటివి వాడాలి.
వడదెబ్బ తగిలితే తీసుకోవాల్సిన చర్యలు
వడదెబ్బకు గురైతే వెంటనే ప్రథమ చికిత్స చేసి దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
ప్రథమ చికిత్సలో భాగంగా వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశంలోకి చేర్చాలి. చల్లని ఫ్యాన్ గాలి తగిలేలా చూడాలి. తడి క్లాత్‌తో తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు తుడవాలి.
ఉప్పు కలిపిన మజ్జిగ లేదా.. ఉప్పు కలిపిన గ్లూకోస్ నీరు.. ఓఆర్‌ఎస్ వాటర్ తాగించాలి.
ఒకవేళ వడదెబ్బకు గురై అపస్మారకస్థితిలోకి చేరిన వ్యక్తికి నీరు తాగించరాదు.
వీలైనంత తొందగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లాలి.
ఇలాంటి చర్యలతో వడదెబ్బకు గురైన వారిని కాపాడుకోవచ్చని జిల్లా వైద్యాధికారి వెంకటరావణ తెలిపారు. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వడదెబ్బ బారిన పడకుండా చూసుకోవాలి
ఉదయం 11నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇంట్లో ఉంటేనే సేఫ్
వైద్య ఆరోగ్య శాఖ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి వెంకటరవణ

అప్రమత్తతే రక్ష

అప్రమత్తతే రక్ష

అప్రమత్తతే రక్ష