నేడు జెడ్పీ పాఠశాల వార్షికోత్సవం
బొంరాస్‌పేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాలను మంగళవారం నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎం, ఎంఈఓ హరిలాల్ తెలిపారు. మధ్యాహ్నం వీడ్కోలు కార్యక్రమంలో ప్రముఖ మానసికవేత్త, ప్రేరణ కర్త డాక్టర్ పి.లక్ష్మణ్ ప్రేరణ కార్యక్రమాలు, సాయంత్రం వార్షికోత్సవంలో జిల్లా కలెక్టర్, డీఈఓ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పలువురు నేతలు హాజరుకానున్నారని చెప్పారు. విద్యార్థులచే సాంస్కృతిక ఉంటాయన్నారు. పేరొందిన పూర్వ విద్యార్థులకు సన్మానాలు, బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు.
20న తైబజార్ వేలం
కొడంగల్: మున్సిపల్ పరిధిలోని తైబజార్ (అంగడి బజార్)కు ఈ నెల 20న వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాలరాం నాయక్ సోమవారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ముందగా రూ.50 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకోడానికి మంగళవారం చివరి రోజని చెప్పారు.
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
మాడ్గుల: మండల పరిధి కొల్కులపల్లిలో వైన్ షాప్‌లో చోరీకి పాల్పడిన నేనావత్ సాయికుమార్‌ను సోమవారం అరెస్టు చేశామని సీఐ వేణుగోపాలరావు తెలిపారు. జనవరి ఒకటిన మద్యం దుకాణంలో దొంగతనం చేశాడని, నిందుతున్ని మాడ్గుల ఎక్స్ రోడ్ వద్ద అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచామని సీఐ వివరించారు.
ఇటుక బట్టీలపై విజిలెన్స్ దాడులు
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఇటుక బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయ పొలాలకు వినియోగించే విద్యుత్‌ను, అక్రమంగా పరిశ్రమలకు వాడుతున్నారన్న సమాచారంతో విజిలెన్స్ ఏడీ మోషా ఆధ్వర్యంలో సోమవారం పలు చోట్ల దాడులు నిర్వహించారు. 5 చోట్ల కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. తప్పనిసరిగా కమర్షియల్ మీటర్లు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.