పారిశుద్ధ్యం.. అధ్వానం | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యం.. అధ్వానం

Published Wed, Mar 19 2025 8:03 AM | Last Updated on Wed, Mar 19 2025 8:02 AM

మున్సిపాలిటీల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం

వికారాబాద్‌: పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. వార్డుల్లో సేకరించిన చెత్తను పట్టణ శివారు ప్రాంతాల్లో డంపింగ్‌ చేస్తున్నారు. కాలనీల్లో చెత్త కుండీలు తీసివేయడం.. రోజూ తిరగాల్సిన చెత్త బండ్లు సక్రమంగా రాకపోవడంతో ప్రజలు ప్రధాన కూడళ్లలో చెత్తను పారబోస్తున్నారు. దీంతో కాలనీలు కంపుకొడుతున్నాయి. మున్సిపాలిటీలో పరిస్థితి ఇలా ఉంటే అనుబంధ గ్రామాల్లో మరీ అధ్వానంగా ఉంది. ఇంటి, నల్లా పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్న మున్సిపల్‌ అధికారులు కాలనీల్లో కనీస సౌకర్యాలు, వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమవుతాన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందడం.. అక్కడే చెత్తను డంపింగ్‌ చేస్తుంటంతో ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. తడి పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని చెప్పే మున్సిపల్‌ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. తడి పొడి చెత్తనంతా కలిపే సేకరిస్తున్నారు.

ఎక్కడ చూసినా చెత్త కుప్పలే..

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 34 వార్డులు.. 70 వేల జనాభా ఉంది. పట్టణంలో రోజుకు సగటున 30 నుంచి 32 మెట్రిక్‌ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. వికారాబాద్‌లో తడి పొడి చెత్త వేరు చేసే ప్రక్రియ చేపట్టడం లేదు. కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్‌ నామమాత్రంగా పని చేస్తోంది. వారానికి 400 కిలోల ఎరువులు కూడా తయారు చేయడం లేదు. ప్రస్తుతం మున్సిపల్‌ పరిధిలో ఏ వార్డులో చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని మార్కెట్‌, రైతు బజార్‌ పరిసరాల్లో చెత్త పారబోయడం ఎక్కువగా కనిపిస్తోంది. వికారాబాద్‌ – అనంతగిరి మార్గంలోని మేకల గండి వద్ద చెత్తను డంప్‌ చేస్తున్నారు. చెత్త సేకరణ, తరలింపు కోసం రెండు జేసీబీలు, ఆరు ట్రాక్టర్లు, 17 ఆటోలు వినియోగిస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలోని 34 వార్డుల్లో 157 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు వికారాబాద్‌ను చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

చెత్తపై చిత్తశుద్ధి కరువు

తాండూరు: కేంద్ర ప్రభుత్వం ఏటా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణపై స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమం నిర్వహించి జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేస్తోంది. మూడేళ్లుగా కేంద్రం ప్రకటించే జాబితాలో తాండూరు మున్సిపాలిటీ చిట్ట చివరి స్థానంలో నిలవడం గమనార్హం. అంటే పారిశుద్ధ్య నిర్వహణలో ఈ మున్సిపాలిటీ ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు.తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులు.. 19వేల గృహాలు, 85 వేల జనాభా ఉంది. 254 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. రోజూ 40 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు.ఇందుకోసం 11 ట్రాక్టర్లు, 28 ఆటోలను వినియోగిస్తున్నారు. వీటిలో సగానికి పైగా పని చేయడం లేదు. డంపింగ్‌ యార్డు నిర్వహణను గాలికొదిలేశారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలి. కానీ మున్సిపాలిటీలో ఈ విధానం పాటించడం లేదు. నాలుగేళ్లు గా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ లేకపోవడంతో చెత్త సేకరణ, డంపింగ్‌ అధ్వానంగా మారింది. ఇన్‌చార్జ్‌ అధికారులు ఉన్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. మున్సిపాలిటీలో చెత్త నుంచి ఎరువుల తయారీకి యూనిట్‌ ఏర్పాటు చేసినా అధికారుల నిర్లక్ష్యంగ కారణంగా ప్రక్రియ ఆగిపోయింది.

రోడ్లపైనే ప్రవహిస్తున్న మురుగు

రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా తీరని సమస్యలు

నామమాత్రంగాకంపోస్టు ఎరువుల తయారీ

పట్టించుకోని మున్సిపల్‌ కమిషనర్లు

ఇబ్బందుల్లో ప్రజలు

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. పట్టణాల్లో చెత్త సేకరణ సరిగ్గా లేకపోవడం స్థానికులను ఇబ్బంది పెడుతోంది. రోడ్లపైనే మురుగు ప్రవహిస్తుండటంతో జనం నడవలేని పరిస్థితి నెలకొంది. కాలనీల్లో చెత్త పేరుకుపోవడంతో ఈగలు, దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్యంపై మున్సిపల్‌ కమిషనర్లు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పారిశుద్ధ్యం.. అధ్వానం1
1/2

పారిశుద్ధ్యం.. అధ్వానం

పారిశుద్ధ్యం.. అధ్వానం2
2/2

పారిశుద్ధ్యం.. అధ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement