కమలంలో అసమ్మతి గళం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడిప్రకటనపై స్థానిక నేతల కినుక ● రాజశేఖర్‌రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో గుర్రు ● అధిష్టానం పునరాలోచించాలని సూచన ● భవిష్యత్ కార్యాచరణపైనా చర్చ
వికారాబాద్: బీజేపీ జిల్లా కొత్త అధ్యక్షుడి నియామకంపై అసమ్మతి గళం వినిపిస్తోంది. గద్వాలకు చెందిన డాక్టర్ రాజశేఖర్‌రెడ్డికి అధిష్టానం ఈ బాధ్యతలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. వృత్తి రీత్యా వైద్యుడైన ఆయన ప్రస్తుతం వికారాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం పార్టీలో చేరారు. ఆయనతో పాటు జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను నియమించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సపోర్ట్‌తోనే రాజశేఖర్‌రెడ్డిని అధ్యక్ష పదవి వరించినట్లు కొంతమంది సీనియర్లు అంటున్నారు.
చర్చకు తెర..
కొత్త అధ్యక్షుడి నియామకంపై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి పలువురు సీనియర్లు, జూనియర్లు పోటీ పడగా స్థానికేతరుడైన రాజశేఖర్‌రెడ్డికి పదవి దక్కింది. దీంతో ఆశావహులు అసంతృప్తికి లోనయ్యారు. ఆయన నామినేషన్‌ను తొలగించాలని కొంతమంది సీనియర్లు గత సోమవారం ఉదయం ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా రాజశేఖర్‌రెడ్డికే జిల్లా పగ్గాలు అప్పగించారు. పార్టీ మండల అధ్యక్షుడిగా నియమించాలన్నా కనీసం మూడు సార్లు పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొనడంతో పాటు స్థానికుడై ఉండాలనే నిబంధనను పట్టించుకోలేని స్థానిక నేతలు మండిపడుతున్నారు. మంగళవారం కూడా జిల్లాకు చెందిన కొందరు సీనియర్లు వికారాబాద్‌లో సమావేశమై అసంతృప్తిని వెల్లగక్కడంతోపాటు పాటు భవిష్యత్ కార్యాచరణను చర్చించినట్లు తెలుస్తోంది.
ఆశించి భంగపడిన సీనియర్లు
జిల్లాకు చెందిన పలువురు సీనియర్లు జిల్లా అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డారు. వికారాబాద్‌కు చెందిన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన వండ్ల నందు, వికారాబాద్‌కు చెందిన కేపీ రాజు, శివరాజు అధ్యక్ష రేసులో ఉంటూ వచ్చారు. వీరితో పాటు తాండూరుకు చెందిన ఉప్పరి రమేశ్, పరిగికి చెందిన రాముయాదవ్ తదితరులు కూడా పదవిని ఆశించారు. వీరందరూ తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని అధిష్టానాన్ని విజ్ఞప్తి చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా రాజశేఖర్‌రెడ్డికి పగ్గాలు అప్పగించడంతో ఆశావహులంతా షాక్‌కు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment